Health: మెదడుపై పని ఒత్తిడి.. స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడడంతో సమస్యలు
ABN , Publish Date - Jul 22 , 2025 | 09:35 AM
విశ్రాంతి లేకపోవడం, పని ఒత్తిడి మెదడు జబ్బులకు దారితీస్తోందంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్ పెరగడం, డిజిటల్ ఓవర్‌లోడ్, నిరంతరం స్ర్కీన్‌లను చూడటం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుందని వైద్యులు తెలిపారు.

- బీపీ, షుగర్ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి
- నేడు వరల్డ్ బ్రెయిన్ డే
హైదరాబాద్ సిటీ: విశ్రాంతి లేకపోవడం, పని ఒత్తిడి మెదడు జబ్బులకు దారితీస్తోందంటున్నారు వైద్యులు. మానసిక ఒత్తిడితో బీపీ, షుగర్(BP, sugar) పెరగడం, డిజిటల్ ఓవర్‌లోడ్, నిరంతరం స్ర్కీన్‌లను చూడటం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇటీవల యువత ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుందని వైద్యులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఆస్పత్రులకు వచ్చే బాధితుల్లో 25 శాతం మంది ఉంటున్నారన్నారు. ప్రతీ రోజు ఓపీకి 60 మంది వస్తే వీరిలో 20 మంది ఈ తరహా సమస్యలో ఉంటున్నారని చెప్పారు. ఇందులో 25 నుంచి 45 ఏళ్ల వారు దాదాపు 30 శాతం మంది ఉంటారని న్యూరాలజిస్టులు చెప్పారు. ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోందని, ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో మహిళల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని వైద్యులు వివరించారు.
ధూమపానం, ఆల్కహాల్‌తో..
15 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న వారిలో ఆల్కహాల్(Alcohol), ధూమపానం తాగే వారే ఎక్కువగా ఉంటున్నారు. గ్రేటర్‌లో దాదాపు 30 నుంచి 40 శాతం పొగతాగే వారిలో ఈ వయస్సు వారే. ఈ వయస్సులో స్మోకింగ్ అలవాటు చేసుకున్న వారికి పదేళ్లు గడిచేసరికి మెదడు సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. స్మోకింగ్ వల్ల మెదడులో రక్తనాళాలు పూడుకుపోతాయంటున్నారు. చైన్ స్మోకర్స్‌లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందన్నారు. ఎపిలెప్సీ, డిమెన్షియా, మల్టిపుల్ స్ల్కిరోసిస్, మెదడు క్యాన్సర్ వంటి వ్యాధులు యువతను, వృద్ధులను ప్రభావితం చేస్తున్నాయి. చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.
పోషకాహారం అవసరం
ఈ సంవత్సరపు థీమ్ ‘మెదడు ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన ముందస్తు చర్యల’పై దృష్టి సారించాల్సి ఉంటుంది. మెదడు సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. వాల్‌నట్స్, ఆకుకూరలు వంటి ఆహార పదార్థాలు మెదడుకు బాగా ఉపయోగపడతాయి. మెదడు పనితీరు బాగుండాలంటే పోషకాహారం ఎంతో అవసరం. టెక్నాలజీ మనకు సాధనం మాత్రమే. బ్రెయిన్ టెస్టులు, కాగ్నిటివ్ యాప్స్ మంచి పద్ధతులు అయినా, ఎక్కువగా స్ర్కీన్ చూసే అలవాటు ఫోక్‌సను దెబ్బతీస్తోంది.
ఇలా చేస్తే మంచిది
మెదడుకు మేలు చేసే అలవాట్లలో.. ప్రతీరోజు 7-8 గంటలు నిద్రపోవడం, బి-విటమిన్లు, ఒమెగా-3 ప్యాటీ యాసిడ్లు వంటివి సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. ధ్యానం, మైండ్‌పుల్‌నెస్ విధానాల ద్వారా ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. స్ర్కీన్‌లను చూడటం తగ్గించాలి. పిల్లలు స్కీన్‌ను ఎక్కువ సేపు చూస్తే కంటి చూపు, మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రతీరోజూ 20 మంది మెదడు సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి వస్తున్నారు. వీరిలో మైగ్రేన్, తలనొప్పి, తలతిరగడం, నిద్రలేమి, చేతులు, కాళ్లు తిమ్మిర్లు వంటి ఇబ్బందులున్నాయి.
- డాక్టర్ కైలాస్ మిర్చే, సీనియర్ న్యూరాలజిస్టు, కేర్ ఆస్పత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన గోల్డ్ ధరలు.. కానీ వెండి రేట్లు మాత్రం..
Read Latest Telangana News and National News