Vitamin E: పొడవు జుట్టు కావాలా.. చర్మం మెరిసిపోవాలా.. అయితే ఈ విటమిన్ రోజూ తప్పక తీసుకోండి..
ABN , Publish Date - May 22 , 2025 | 10:26 AM
Vitamin E Benefits: రోజూ విపరీతంగా జుట్టు రాలిపోతోందా.. షాంపూలు, కండీషనర్లు మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం ఉండటం లేదా.. చర్మం కూడా జీవం లేకుండా ఉందా.. అయితే ప్రతి రోజూ ఈ విటమిన్ ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకోండి. రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా మటుమాయం అవుతాయి.

Vitamin E Benefits: చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం, విపరీతంగా రాలిపోవడం, చర్మం పొడిబారడం, మాటిమాటికీ అలసట, ఉన్న వయసు కంటే ఎక్కువ కనిపించడం వంటి సమస్యలున్నాయా.. అయితే, విటమిన్ - ఇ లోపం వల్లే కావచ్చు. తక్కువ మొత్తంలో అవసరమైనా ఈ విటమిన్ శరీరానికి అత్యంత కీలకం. విటమిన్ E ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరం వ్యాధులతో పోరాడటానికి, ఒత్తిడి అరికట్టేందుకు సహాయపడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతున్న రోగనిరోధక శక్తిని కాపాడుకోవడంలో ఈ విటమిన్ చాలా అవసరం. అంతేకాకుండా, మీ జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే విటమిన్-ఇ లోపిస్తే కనిపించే లక్షణాలేంటి? రోజూ ఎంత మోతాదులో తీసుకోవాలి? ఏఏ ఆహార పదార్థాల్లో లభిస్తుంది?
విటమిన్ E లోపం వల్ల కలిగే నష్టాలు
విటమిన్ E లోపం వల్ల చర్మం పొడిబారడం, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. విపరీతంగా జుట్టు రాలిపోతుంది. కంటి చూపు మందగిస్తుంది. నరాలు, కండరాల బలహీనత, శరీర కదలికలపై నియంత్రణ కోల్పోవడం, త్వరగా అలసిపోవడం, గర్భిణుల్లో అయితే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కాబట్టి, ఇతర విటమిన్ల మాదిరే విటమిన్-ఇ కూడా తప్పనిసరిగా తీసుకోవడం చాలా అవసరం. అలాగే ఈ విటమిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే గుండె, కాలేయ ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుంది.
ఎంత మోతాదులో తీసుకోవాలి?
9-13 ఏళ్ల వయసు పిల్లలకు రోజుకు 11 మిల్లీగ్రాములు(mg),
14 ఏళ్ల నుంచి ఆపైన వయసు వారందరికీ రోజుకు 15 మిల్లిగ్రాములు (mg) విటమిన్ E అవసరం.
గర్భిణులు లేదా బాలింతలు 19 మిల్లిగ్రాములు (mg) విటమిన్ E అవసరం. అయితే డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మంచిది.
విటమిన్-ఇ అధిక మోతాదులో తీసుకున్నా కూడా ప్రమాదమే. తలనొప్పులు, కడుపునొప్పి వంటి దుష్పరిణామాలు రావచ్చు.
విటమిన్ ఇ ఎలా పొందాలి?
విటమిన్ ఇ ప్రధానంగా పొద్దుతిరుగుడు గింజలు లేదా నూనె, సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఆవాలు, బాదం, వాల్‌నట్, పిస్తా, వేరుశెనగలు, పాలకూర, బ్రోకోలీ, మొలకెత్తిన శనగలు, చేపలు (సాల్మన్, మాకరెల్), గుమ్మడికాయ గింజలలో లభిస్తుంది. ఆహారంలోని పోషక విలువలపై శ్రద్ధ వహిస్తే ప్రతి ఒక్కరూ విటమిన్ ఇ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సప్లిమెంట్లకు బదులుగా ఆహారం ద్వారా తీసుకుంటేనే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జుట్టు నెరవడాన్ని అడ్డుకోవాలంటే ఈ ఫుడ్స్ తినడం తప్పనిసరి
ఎండలో రోజూ 10 నిమిషాలు నిలబడితే సమృద్ధిగా విటమిన్ సీ
ఈ ట్రిక్ చిటికెలో మైగ్రేన్ నొప్పిని తగ్గిస్తుంది..
Read Latest Health News And Telugu News