Share News

సన్నబడాలనే ఆశతో వెయిట్ లాస్ పిల్స్ వేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి..!

ABN , Publish Date - Jun 22 , 2025 | 08:41 AM

Weight Loss Pills: ప్రపంచవ్యాప్తంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతుండటం వల్ల బరువు తగ్గించే మాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. వీటి వాడకం నిజంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయి? లాభమా? నష్టమా?

సన్నబడాలనే ఆశతో వెయిట్ లాస్ పిల్స్ వేసుకుంటున్నారా? ముందు ఇది తెలుసుకోండి..!
Risks and Benefits of Weight Loss Pills

Weight Loss Pills Risks and Benefits: గత కొన్నేళ్లుగా ఇండియాలో బరువు తగ్గించే మాత్రలకు ప్రజాదరణ గణనీయంగా పెరిగింది. ఊబకాయం వేగంగా తగ్గించుకోవాలనే కోరికతో జనాలు వీటి వైపు మొగ్గుచూపడమే కారణం. కానీ, బరువు తగ్గించే మాత్రలను రెండు రకాలుగా విభజించారు. ఒకటి ప్రిస్క్రిప్షన్ మాత్రలు. రెండోవి ఓవర్-ది-కౌంటర్ (OTC) సప్లిమెంట్లు. సాధారణ మందుల్లో ఆర్లిస్టాట్ వంటి కొవ్వు శోషణ నిరోధకాలు, ఫెంటెర్మైన్ వంటి ఆకలిని అణిచివేసేవి ఉంటాయి. అయితే, OTC మందులతో అసాధారణంగా బరువు కోల్పోతారు. వీటిని అధికంగా ఆన్‌లైన్‌ లేదా ఫిట్‌నెస్ కేంద్రాలు, మూలికలు, ఆయుర్వేద మందుల రూపంలో విక్రయిస్తుంటారు.


వెయిట్ లాస్ మాత్రల వాడకాన్ని ఆపివేసిన తర్వాత ఆరోగ్యకర జీవనశైలి, ఆహారపు అలవాట్లు పాటించకపోతే మళ్లీ మళ్లీ బరువు పెరుగుతారు. చాలామంది వైద్యుల సిఫార్లు లేకుండానే సొంతంగా ఇలాంటి పిల్స్, సప్లిమెంట్లు వాడేస్తుంటారు. వీటిలో చాలావరకూ నాణ్యత లేనివి, ఆరోగ్యానికి చేటు చేసేవే ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదేగాక, బరువు తగ్గించే మందులు తరచుగా జీర్ణశయ సమస్యలు, అధిక రక్తపోటు, ఆందోళన, నిద్ర సమస్యలు, వేగవంతమైన హృదయ స్పందన రేటుకు కారణమవుతాయి. కాలేయం దెబ్బతినడం, హార్మోన్ల మార్పులు, ఇతర మందులు పనిచేయకుండా పోవడం వంటి తీవ్రమైన ప్రమాదాలు కలుగుతాయి.


ఈ మందులను వైద్య సలహా లేకుండా లేదా ఇతర మందులతో కలిపి తీసుకుంటే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారు ఈ మందులు వాడితే తీవ్ర దుష్ప్రభావాలకు లోనయ్యే అవకాశం ఎక్కువ. కౌమారదశలో ఉన్నవారు ఇలాంటి పిల్స్ వేసుకుంటే ఒత్తిడి, ఆందోళన పెరిగి అందం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ మందులను విచక్షణారహితంగా, అధిక మోతాదులో తీసుకునే మహిళల్లో థైరాయిడ్ వ్యాధి రావచ్చు. ముఖ్యంగా PCOSతో బాధపడుతున్న వారికి ఎండోక్రైన్ రుగ్మతల ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువకాలం లేదా అనుచితంగా ఓవర్-ది-కౌంటర్ (OTC) సప్లిమెంట్లు వాడిన వారు కాలేయ వైఫల్యం, ఎలక్ట్రోలైట్ ఆటంకాలు వంటి తీవ్రమైన దుష్ప్రభావాల బారిన పడినట్లు ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది.


కాబట్టి, బరువు తగ్గించే మందుల గురించి వేసుకునేవారూ, వేసుకోవాలని అనుకునేవారూ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. స్థిరంగా బరువు తగ్గడానికి ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి మందులూ అందుబాటులో లేవని గుర్తుంచుకోండి. వైద్యులను సంప్రదించి వారి సలహా ప్రకారం బరువు తగ్గించుకునే మార్గాలు వెతకండి. బరువు నియంత్రణ కోసం పాటించాల్సిన డైట్, జీవనశైలి గురించి వైద్య సహాయం తప్పక తీసుకోండి.


Also Read:

వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదా.. బీ అలర్ట్..

కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి ఎందుకు మారతాయో తెలుసా..

For More Health News

Updated Date - Jun 22 , 2025 | 09:37 AM