Mouth Cancer: ముఖంలో కనిపించే ఈ చిన్న మార్పే... నోటి క్యాన్సర్‌కు సంకేతమా?
ABN , Publish Date - Jun 19 , 2025 | 07:13 AM
Tobacco and Oral Cancer: పొగాకు, పొగాకు ఆధారిత ఉత్పత్తుల వాడకం నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారకం. సాధారణంగా నోటి క్యాన్సర్ లక్షణాలు ముందుగా గుర్తించడం కష్టం. కానీ, ఇటీవల పరిశోధకులు ఈ ప్రాణాంతక వ్యాధి ముందస్తు లక్షణాలు, చికిత్స పద్ధతులు రివీల్ చేశారు.

Oral Cancer Early Signs and Prevention: భారతదేశంలో పొగాకు, పొగాకు ఆధారిత ఉత్పత్తుల సేవించడం వల్లే ఎక్కువగా నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలి పరిశోధనల నివేదికల ప్రకారం, ప్రజలు ముందుగానే శరీరంలో ఈ మార్పులను గమనిస్తే చాలా కేసులను తొలిదశలోనే నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, భారతదేశంలో 80% కంటే ఎక్కువ మంది నోటి క్యాన్సర్ రోగులు పొగాకు వాడేవారే ఉన్నారు. ముఖ్యంగా గుట్కా, ఖైనీ, పాన్ వంటి పొగలేని పొగాకును ఉపయోగించేవారిలోనే నోటి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్ కేసుల్లో దాదాపు మూడో వంతు భారతదేశంలోనే నమోదవుతున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ సంఖ్య పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'ఓరల్ క్యాన్సర్ ఇకపై వృద్ధుల వ్యాధి మాత్రమే కాదు' అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 5-10 సంవత్సరాలుగా గుట్కా లేదా పొగాకు నమలడం వల్ల యువత క్యాన్సర్ కు బలవుతున్నారు. కాబట్టి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలంటే ముందుగానే పొగాకును దూరం పెట్టండి. అధికంగా టొబాకో వాడేవారు ఈ లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే అప్రమత్తమవండి.
నోటి క్యాన్సర్ లక్షణాలు
నోటి క్యాన్సర్ సాధారణ లక్షణాలు నోటిలో పుండు. రెండు వారాలు దాటినా నోటిలో పుండు నయం కాకపోవడం.
చిగుళ్ళు, నాలుక లేదా బుగ్గల లోపలి భాగంలో తెల్లటి లేదా ఎరుపు రంగు మచ్చలు.
నమలడంలో, మింగడంలో లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బంది.
చెంప లోపలి భాగం ముద్దగా మారడం లేదా దంతాలు అకస్మాత్తుగా వదులుగా ఉండటం
నోటిలో లేదా దవడలో కొంత భాగం తిమ్మిరి.
పై లక్షణాలు సాధారణమైనవిగా అనిపించవచ్చు. కానీ, అవి రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే ఆ వ్యక్తి కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 30 నుండి 60 సంవత్సరాల వయస్సు గల పురుషుల్లో నోటి క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ ఉందని వైద్యులు చెబుతున్నారు. నేషనల్ ఓరల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రకారం, భారతదేశంలో సిగరెట్లు లేదా బీడీల కంటే "పొగలేని పొగాకు" వాడకమే అధికంగా ఉంది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలో. ఈ ప్రాంతాలలో పొగాకును తరచుగా క్యాన్సర్ కారకమైన అరెకా గింజ (సుపారి)తో కలుపుతారు. అయితే, ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా నోటి క్యాన్సర్ కేసులను నివారించవచ్చని వైద్యులు అంటున్నారు. పొగాకు, ధూమపానం మానేయడం అనేది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారం అని సూచిస్తున్నారు.
యువత పొగాకు వాడకాన్ని ప్రారంభించకుండా నిరోధించడానికి, ముఖ్యంగా పాఠశాలలు మరియు కళాశాలలలో అవగాహన ప్రచారాలను నిర్వహించాలని ప్రజారోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. భారతదేశంలో ప్రభుత్వాలు ఇప్పటికే పొగాకు ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మరింతగా కృషి చేయాల్సి అవసరముందని అభిప్రాయపడుతున్నారు. నోటి క్యాన్సర్ తరచుగా నిశ్శబ్దంగా ప్రారంభమవుతుందని. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చని డాక్టర్ అన్నారు. ముందస్తుగా గుర్తించడం వల్ల తక్షణ చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చు.
Also Read:
వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..
తరచూ తుమ్ములా? అలెర్జీ వల్లే కాదు.. ఈ సమస్య కూడా కావచ్చు..!
For More Health News