Share News

Cancer Alert: పెరిగిన కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ ముప్పు

ABN , Publish Date - Apr 23 , 2025 | 04:43 AM

కొలొరెక్టల్ క్యాన్సర్ ముప్పు 45 ఏళ్లు లోపలివారిలోనూ పెరిగుతోంది. స్క్రీనింగ్‌తో ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించవచ్చని అధ్యయనం చెబుతోంది.

Cancer Alert: పెరిగిన కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ ముప్పు

  • కాంటినెంటల్‌ ఆస్పత్రి అధ్యయనంలో వెల్లడి

  • మూడు వేల మందికి కొలోనోస్కోపీ స్ర్కీనింగ్‌

  • 25.27 శాతం మందిలో కణితుల గుర్తింపు

  • వీరిలో 50 ఏళ్లలోపు వయసు వారు కూడా..

  • ప్రాథమిక దశలో కణితుల తొలగింపుతో క్యాన్సర్‌కు చెక్‌

  • 45 ఏళ్లు దాటిన వారు పరీక్షలు చేయించుకోవాలి

  • ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొలొరెక్టల్‌ (పెద్దపేగు-పురీషనాళం) క్యాన్సర్‌... ఇది 50 సంవత్సరాల వయసు పైబడిన వారికే వస్తుందని చాలామంది అనుకుంటారు. ఇది ఇంతకు ముందున్న పరిస్థితి. కానీ, మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, మద్యం, ధూమపానం వంటి కారణాల వల్ల ఇప్పుడు 30, 40 ఏళ్ల వారిలో కూడా కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో 50 ఏళ్లు అనుకున్న వయోపరిమితిని ఇప్పడు 45గా పరిగణించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర క్యాన్సర్లపై ఉన్న అవగాహన కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ (సీఆర్‌సీ) విషయంలో ఉండడం లేదు. అయితే పరీక్షలు చేయించుకోవడం ద్వారా మున్ముందు వచ్చే సీఆర్‌సీకి ప్రాథమిక దశలోనే చెక్‌ పెట్టవచ్చని కాంటినెంటల్‌ ఆస్పత్రి వ్యవస్థాపక చైర్మన్‌, చీఫ్‌ గ్యాస్ట్రో ఎంటారాలజిస్టు డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. మూడేళ్ల పాటు సీఆర్‌సీపై చేసిన విస్తృత అధ్యయనంలో దాని తీవ్రత దేశంలో ఎక్కువగానే ఉన్నట్లు తేలిందని చెప్పారు. అధ్యయనం ఫలితాలను ఆయన మంగళవారం గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


గత మూడేళ్లలో తమ ఆస్పత్రిలో కొన్ని వేల మందికి కొలొనోస్కోపీ స్ర్కీనింగ్‌ చేసినట్లు చెప్పారు. వీరిలో 28.03 శాతం మంది పురుషులు, 21.15 శాతం మంది మహిళల్లో ప్రీ-క్యాన్సర్‌ కణితుల (పాలిప్స్‌)ను గుర్తించినట్లు తెలిపారు. ముఖ్యంగా 45 నుంచి 49 ఏళ్ల వయస్సు పురుషుల్లో 10.3 శాతం మందిలో పాలిప్స్‌ ఉన్నాయన్నారు. తగిన చికిత్స ద్వారా కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. పాలిప్స్‌ను గుర్తించి వెంటనే తొలగించకపోతే అవి కొలొరెక్టల్‌ క్యాన్సర్‌కు దారి తీసి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చని పేర్కొన్నారు.

మూడేళ్ల పాటు అధ్యయనం

‘కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్య బృందం 2022 జనవరి నుంచి 2024 డిసెంబరు వరకు 2,998 మందిపై ఈ అధ్యయనం నిర్వహించింది. వీరిలో 1,798 మంది పురుషులు, 1,200 మంది మహిళలు! 45 ఏళ్ల వయసు పైబడిన పురుషులు 1,181 మంది, మహిళలు 841 మంది ఉన్నారు. 45 ఏళ్లలోపు వారు పురుషులు, మహిళలు కలిపి 976 మంది’ అని డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో సీఆర్‌సీ కేసులు 10 శాతం ఉంటాయి. క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో రెండో స్థానం సీఆర్‌సీదే. భారతదేశంలో మిజోరాం, జమ్మూ కశ్మీర్‌, కేరళలో, దక్షిణాదిలో ముఖ్యంగా కొల్లం, తిరువనంతపురం, బెంగళూరులో వ్యాధి తీవ్రత, మరణాలు ఎక్కువగా ఉన్నాయ’ని పేర్కొన్నారు. ముందుజాగ్రత్తగా 45 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు కొలొనోస్కోపీ స్ర్కీనింగ్‌ చేయించుకోవాలని సూచించారు


ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫొటో..

Gold Rate History: 2000 నుంచి 2025 వరకు బంగారం ధరల్లో ఎంత మార్పు..

Updated Date - Apr 23 , 2025 | 04:45 AM