Pregnancy Tips: వర్షాకాలంలో గర్భిణీలకు ఈ 7 వ్యాధులు వచ్చే ఛాన్స్.. బీ కేర్‌ఫుల్..
ABN , Publish Date - Jun 27 , 2025 | 08:15 AM
Monsoon Infections During Pregnancy: గర్భాధారణ సమయంలో సాధారణంగానే మహిళలు తరచూ రకరకాల సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడైతే వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా వర్షాకాలం బ్యాక్టీరియా, దోమలు, ఇన్ఫెక్షన్లు వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని రకాల తీవ్ర వ్యాధులు సోకకూడదంటే కింది జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

Monsoon Care Tips for Pregnant Women: వర్షాకాలంలో చిటపట కురిసే చినుకులు మనసును గిలిగింతలు పెడతాయి. వేడి నుంచి ఉపశమనం కల్పించి ఆనందాన్ని పంచే ఈ రుతువు అనారోగ్యాన్ని వెంటబెట్టుకొస్తుంది. చిన్నపాటి జల్లులకే ఎక్కడు చూసిన రోడ్లు, డ్రైనేజీలు వరదల్లా ఉప్పొంగుతూ దుర్వాసనను వెదజల్లుతుంటాయి. అంతేకాదు, దోమలు, క్రిమికీటకాలు వృద్ధి చెందేందుకు చల్లటి వాతావరణం సహకరిస్తుంది. అందుకే ఈ కాలంలో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం మరీ ఎక్కువ. తడి వాతావరణంలో ఎక్కువగా అనారోగ్యాలకు గురయ్యేది పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు. మిగతావారితో పోలిస్తే తక్కువ రోగనిరోధకశక్తి కారణంగా కాబోయే తల్లులు వేగంగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. ఇంతకీ, వానాకాలంలో గర్భిణీలకు సోకే 7 ప్రధాన వ్యాధులు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
డెంగ్యూ: గర్భధారణ సమయంలో మహిళలు అదనపు జాగ్రత్తలు, నివారణ చర్యలు తీసుకోవాలి. ఇంటి చుట్టు పట్ల అపరిశుభ్రవాతావరణం కారణంగా డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశముంది. కాబట్టి, ఈ సమస్యను ముందే నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే, డెంగ్యూ వల్ల ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం, డీహైడ్రేషన్, ముందస్తు ప్రసవం వంటి సమస్యలు రావచ్చు.
మలేరియా: గర్భధారణ సమయంలో మలేరియా సోకితే మహిళల్లో తీవ్రమైన రక్తహీనత ఏర్పడి శిశువు తక్కువ బరువుతో జన్మించవచ్చు. పుట్టిన తర్వాత కూడా బిడ్డ అనేక అనారోగ్య సమస్యలకు గురయ్యే ఛాన్స్ ఉంది.
లెప్టోస్పిరోసిస్: గర్భిణీ స్త్రీకి లెప్టోస్పిరోసిస్ సోకితే అది గర్భస్రావం లేదా అవయవ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇది లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా వ్యాపిస్తుంది.
టైఫాయిడ్ జ్వరం: వర్షాకాలంలో టైఫాయిడ్ వ్యాప్తి చెందడానికి పారిశుద్ధ్య సమస్యలే కారణం. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషితమైన నీటివల్ల గర్భధారణ సమయంలో తీవ్ర జ్వరం రావచ్చు. దీనివల్ల ఇతర సమస్యలు వస్తాయి.
హెపటైటిస్ ఎ, ఇ: ఈ వైరస్‌లు అపరిశుభ్రమైన పరిస్థితులలో వృద్ధి చెందుతాయి. సాధారణంగా ఫిల్టర్ చేయని నీరు లేదా వంట చేయడంలో శుభ్రత పాటించకపోయినా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. హెపటైటిస్ ఇ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను మోసుకొస్తుంది. ముఖ్యంగా గర్భస్రావానికి, కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది.
గ్యాస్ట్రోఎంటెరిటిస్: ఇది కాబోయే తల్లి మొత్తం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీని వలన శరీరంలో పోషకాలు లోపిస్తాయి. డీహైడ్రేషన్ తీవ్రంగా ఉంటుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్: గర్భిణీ స్త్రీలల్లో హార్మోన్లలో మార్పులు జరగడం సర్వసాధారణం. దీని వల్ల చర్మ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల నివారణకు చిట్కాలు
గర్భధారణ సమయంలో ఫ్లూ, జలుబు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను నివారించడానికి వ్యక్తిగత పరిశుభ్రత పద్ధతులను పాటించాలి.
కడిగిన కూరగాయలు, పండ్లను మాత్రమే తినండి. రోడ్డు పక్కన అమ్మేవారి నుండి నీరు తాగడం మానేయండి. అపరిశుభ్రమైన ఆహారాలు, కడగని పండ్లు, కూరగాయలు తినడం వల్ల అతిసారం, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆహార సంబంధిత వ్యాధులు వస్తాయి.
బకెట్లు లేదా కుండలలో నీటిని నిల్వ చేయవద్దు. దోమల పెరుగుదలను నియంత్రించడానికి వాటిని శుభ్రంగా ఉంచండి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆకుపచ్చని కూరగాయలు, విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. వీటితో పాటు గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సరైన విశ్రాంతి తీసుకోవడం, హైడ్రేటెడ్ గా ఉండటం కూడా చాలా అవసరం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?
For More Health News