Share News

Hyderabad: తాటి ముంజలొచ్చేశాయ్..

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:18 AM

వేసవి సీజన్‏లో లభ్యమయ్యే తాటి ముంజల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజల్లో ఎన్నో పోషక విలువలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఆయా కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు.

Hyderabad: తాటి ముంజలొచ్చేశాయ్..

- పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం

- శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయంటున్న వైద్యులు

హైదరాబాద్: ప్రకృతి ప్రసాదించిన తాటి ముంజలు నగరానికి చేరుకున్నాయి. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్ని అందించే ముంజలంటే చాలా మందికి ఇష్టమే. తాటి ముంజలు ఏప్రిల్‌, మే నెలలో మాత్రమే లభిస్తాయి. వ్యాపారులు నల్గొండ, మెదక్‌, వికారాబాద్‌(Nalgonda, Medak, Vikarabad) జిల్లాలతో పాటు మహానగరాన్ని ఆనుకుని ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల్లో నగరానికి తీసుకువచ్చి అమ్ముతున్నారు. అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: చర్లపల్లి టర్మినల్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌ మార్గాల్లో 36 రైళ్ల పొడిగింపు


తాటి ముంజలకు భలే గిరాకీ...

వేసవిలో చల్లదనం కలిగించే తాటి ముంజలను కొనుగోలు చేసేందుకు జేఎన్‌టీయూ, కేపిహెచ్‌బీ కాలనీ, మదీనగూడ, మియాపూర్‌, చందానగర్‌, ఎర్రగడ్డ, భరత్‌నగర్‌తో పాటు శివారు ప్రాంతాలలోని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు మార్కెట్‌లో, రోడ్ల పక్కన పెట్టుకుని అమ్ముతుండగా.. మరికొందరు ద్విచక్ర వాహనాలు, సైకిళ్లు, తోపుడుబండ్ల మీద తిరిగి అమ్ముతున్నారు. ముంజల్లో దాహర్తిని తీర్చె సుగుణాలే కాదు ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తుండడంతో ముంజల అమ్మకాలు ఊపందుకున్నాయి. ముంజలను డజను 150 నుంచి 200కి వ్యాపారులు విక్రయిస్తున్నారు.


ఔషధ గుణాలివే..

తాటి ముంజలు వేసవిలో ఒళ్లు మంటల నుంచి ఉపశమనం కలిగించడే కాదు శరీరానికి జల సమతుల్యం చేస్తాయి. వీటిలో పుష్కలమైన మినరల్స్‌, విటమిన్లు ఉన్నాయి. డీహైడ్రేషన్‌ నుంచి కాపాడతాయి. జలపదార్థం అధిక మోతాదులో ఉండడంతో దాహర్తిని తీర్చి, ఆకలిని తీర్చుతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. వంద గ్రాముల ముంజల్లో 29 కేలరీల శక్తి, తేమ- 99 శాతం, ప్రొటీన్లు - 1 గ్రాము, పిండిపదార్థాలు - 6 గ్రాములు, కాల్షియం - 10 మిల్లిగ్రాములు, పాస్పరస్‌ - 2 మిల్లిగ్రాములు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. తాటి ముంజలు తినడం వల్ల శరీరానికి చల్లదనమే కాకుండా జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

city7.2.jpg


నల్గొండ నుంచి తెచ్చి విక్రయిస్తున్నా

ముంజలను నల్గొండ నుంచి తీసుకువస్తున్నా. నాతో పాటు మరో నలుగురం కలిసి వ్యాపారం చేస్తున్నాం. నగరంలోని వివిధ ప్రాంతాలలో ముంజలను విక్రయిస్తున్నాం. రోజురోజుకు అమ్మకాలు పెరుగుతున్నాయి. డజను 200 వరకు విక్రయిస్తున్నాం. సీజన్‌ పూర్తయ్యే వరకు ముంజలు అమ్ముతాం.

- రాయుడు, వ్యాపారి


ముంజలంటే ఇష్టం

వేసవి కాలంలో మాత్రమే అరుదుగా లభించే ముంజలు తినడం అంటే చాలా ఇష్టం. అవి తింటే ఎండవేడిమి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. నా బాల్యంలో వేసవి సెలవుల్లో మా ఊరికి వెళ్లినప్పుడు ముంజల కోసం పోటీ పడి మరీ తెచ్చుకుని తినేదాన్ని.

- నిర్మల, టీచర్స్‌ కాలనీ, ఓల్డుబోయినపల్లి


ఈ వార్తలు కూడా చదవండి

హైదరాబాద్‌-విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణకు 5 వేల కోట్లు

డిజిటల్ లైంగిక నేరాలపై చట్టమేదీ?

చిన్నారి ప్రాణం తీసిన పల్లీ గింజ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 29 , 2025 | 11:18 AM