Dengue Mosquito: డెంగ్యూ సీజన్ మొదలైంది జాగ్రత్త.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేందుకు ఇలా చేయండి..
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:04 AM
Natural Ways To Protect From Dengue: దోమకాటు వల్ల సోకే ప్రాణాంతక వ్యాధుల్లో డెంగ్యూ ఒకటి. తడివాతావరణంలో ఈ దోమల కారణంగా విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి, డెంగ్యూ నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

Ways To Prevent Dengue Mosquitoes At Home: నైరుతి రుతుపవనాల రాకతో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో డెంగ్యూ జ్వరంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇది దోమల నుంచి వ్యాప్తి చెందే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచ జనాభాలో సగం మంది ఇప్పుడు డెంగ్యూ ప్రమాదంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం 100–400 మిలియన్ల మందికి డెంగ్యూ దోమ కాటుతో ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని అంచనా. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ప్రకారం 2025 ప్రారంభం నుంచి దేశంలో నమోదైన మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 7,077కి చేరింది. డెంగ్యూ సోకిన చాలా మందిలో తీవ్ర లక్షణాలు ఉండవు. అధిక జ్వరం, తలనొప్పి, శారీరక నొప్పులు, వికారం, దద్దుర్లు ఇలా అత్యంత సాధారణ లక్షణాలే కనిపిస్తాయి. కొంతమందికి మాత్రం డెంగ్యూ ప్రాణాంతక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి, డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ముందుగా మీ ఇంట్లోకి ఈ దోమలు చొరబడకుండా ఏం చేయాలో తెలుసుకోండి.
డెంగ్యూ చాలా మందికి 1–2 వారాల్లోనే నయమవుతుంది. కొంతమందికి తీవ్రస్థాయిలో వస్తుంది. అలాంటివారు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం అవసరం. కొన్ని సందర్భాల్లో డెంగ్యూ ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకు ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.
దోమ కాటును నివారించండి
పగటిపూట కుట్టే ఏడిస్ దోమల ద్వారా డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమ కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి చర్మం బయటకు కనిపించకుండా బట్టలు ధరించండి లేదా దుస్తులపై మస్క్యూటో రిపెల్లర్స్ ఉపయోగించండి.
ఈ దుస్తులు ధరించండి
బయటకు వెళ్లినప్పుడు పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు, పాదాలను కప్పి ఉంచేందుకు బూట్లు ధరించండి. లేత రంగు దుస్తులు మంచివి. ఎందుకంటే అవి దోమలను తక్కువగా ఆకర్షిస్తాయి.
దోమతెరలు
దోమతెరల కింద పడుకోండి. దోమలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి కిటికీలు, తలుపులపై మెష్ తెరలు ఏర్పాటు చేయండి.
నిలిచి ఉన్న నీటిని తొలగించండి
ఏడిస్ దోమలు నిలిచి ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. కాబట్టి, వీటిని సంఖ్యను నిరోధించడానికి పూల కుండీలు, బకెట్లు, బాత్ టబ్, కూలర్లు వంటి వాటిని ఎల్లప్పుడూ ఖాళీ చేసి శుభ్రం చేయండి.
పరిసరాలను శుభ్రంగా ఉంచండి
చెత్తను క్రమం తప్పకుండా ప్రతిరోజూ పారవేయండి. మీ ఇంటి లోపల, చుట్టుపక్కల నీరు పేరుకుపోకుండా చర్యలు తీసుకోండి. అలాగే, డ్రైనేజీలు, గట్టర్లు శుభ్రం ఉండేలా చూసుకోండి.
Also Read:
ప్రీ-డయాబెటిస్ నయం చేసేందుకు 10 మార్గాలు..
వయసు కాదు.. ఈ అలవాట్లే కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులకు కారణం..!
For More Health News