Share News

Health: సీవోపీడీతో ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి..

ABN , Publish Date - Nov 19 , 2025 | 10:37 AM

సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్‌, పాసివ్‌ స్మోకర్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు.

Health: సీవోపీడీతో ఊపిరితిత్తులు ఉక్కిరి బిక్కిరి..

- ధూమపానంతో తీవ్రం

- వాయునాళానికి అడ్డంకి

- నేడు వరల్డ్‌ సీవోపీడీ డే

హైదరాబాద్‌ సిటీ: సీవోపీడీ ఊపిరితిత్తులలో అవరోధాన్ని కలిగించే జబ్బు. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాలుష్యంలో తిరిగే, ఫ్యాక్టరీల్లో పనిచేసే, రసాయనిక, ఆభరణాలకు పూత పూసే వారిలో, స్మోకర్స్‌, పాసివ్‌ స్మోకర్స్‌లో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు వివరించారు. ప్రతీ ఏడాది నవంబరు 19వ తేదీని వరల్డ్‌ సీవోపీడీ డేగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సీవోపీడీ డేను ‘శ్వాస జీవితానికి అవసరం’ అనే థీమ్‌తో ఊపిరితిత్తులపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠకుల కోసం ప్రత్యేక కథనం.


స్మోకర్స్‌లో ఎక్కువగా కనిపించే క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డీసీజ్‌ (సీవోపీడీ) ఇప్పుడు అందరిలో కనిపిస్తుంది. నగరంలో కాలుష్యం పెరిగిపోవడంతో సీవోపీడీ బాధితుల సంఖ్య పెరిగిపోయింది. సిగరెట్‌ తాగే వారిలో 20 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రతీనెల కనీసం 150 నుంచి 250 మంది సీవోపీడీ బాధితులకు చికిత్స చేస్తున్నామని చెప్పారు. ప్రతీనెల 10 నుంచి 20 కేసులు కొత్తవి ఉంటున్నాయని వివరించారు.


సిగరెట్‌ తాగి విడిచే పొగను పీల్చడం వల్ల పాసివ్‌ స్మోకర్స్‌లో ఇది మరింత ప్రాణాంతకమవుతుందని అంటున్నారు. చైన్‌ స్మోకర్స్‌, పది, పదిహేనేళ్ల పాటు సిగరెట్‌ తాగుతున్న వారిలో ఈ జబ్బు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. 15 ఏళ్ల వయస్సులో సిగరెట్‌ తాగడం అలవాటు చేసుకుంటే 25 నుంచి 30 ఏళ్ల వయస్సు వచ్చేసరికి సీవోపీడీ జబ్బు కనిపిస్తుందని వైద్యులు తెలిపారు.


city7.jpg

వాయునాళాలు సన్నబడతాయి

సీవోపీడీ వల్ల ఊపిరితిత్తుల లోపలికి, బయటకు గాలిని సరఫరా చేసే వాయు నాళాలు సన్నబడతాయని వైద్యులు వివరించారు. దీనివల్ల పీల్చుకునే గాలి తక్కువగా ఉంటుందని, గాలిని బయటకు పంపలేరని చెప్పారు. వాయునాళాలు సన్నబడడం వల్ల ఊపిరిత్తులు బరువుగా ఉన్నట్లు, ఛాతి పట్టేసినట్లు, శ్వాస ఆడనట్లుగా అనిపిస్తుందని చెప్పారు. ఆస్తమా, నుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారిలో ఈ జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.


కారణాలు

ధూమపానం, వాయు కాలుష్యం, ఊపిరితిత్తుల సమస్యలు పెరగడం, ఆస్తమా, బాల్యంలో అంటువ్యాధులు రావడం వంటివి సీవోపీడీకి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనివల్ల శ్వాసకోశ ఇబ్బందులు, గుండె ఆగిపోవడం, ఊపితిత్తుల కేన్సర్‌, ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు, డిప్రెషన్‌ వంటి సమస్యలు వస్తాయి. వైద్యుల సలహా మేరకు మందులు వాడడం, ఫిజియోథెరపీ వంటి వాటితో సీవోపీడీకి చెక్‌ పెట్టవచ్చన్నారు.


గుండె జబ్బుల తర్వాత తీవ్రమైనది

2019 గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ అధ్యయనం ప్రకారం భారతేదేశంలో దాదాపు 37.8 మిలియన్ల మంది సీవోపీడీతో బాధపడుతున్నారు. గుండె జబ్బు తర్వాత తీవ్రమైనది. జీవనశైలి మార్పులతో దీనిని నియంత్రించవచ్చు. ధూమపానం మానేయడం, పొగ, దుమ్ముకు దూరంగా ఉండటం, నడక, శ్వాస వ్యాయామాలు చేయడంతోపాటు టీకాలు వేసుకోవాలి.

- డాక్టర్‌ ప్రవీణ్‌ కోటిపల్లి, పల్మనాలజిస్టు,

మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి


పరీక్ష ద్వారా నిర్ధారణ

విపరీతమైన దగ్గు రావడం, దగ్గులో శ్లేష్మం వస్తే, ఊపిరి పీల్చడంలో ఇబ్బందిగా అనిపించడం. జలుబు, ఛాతి ఇన్‌ఫెక్షన్‌ తగ్గకపోవడం, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తే సీవోపీడీగా అనుమానించాలి. శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా ఉన్నా, మందులు వాడినా దగ్గు, జలుబు తగ్గకపోతే లంగ్‌ ఫక్షనింగ్‌ టెస్టు చేయించుకుంటే ఊపిరితిత్తుల పనితీరు తెలుస్తుంది.

- డాక్టర్‌ భావన, పల్మానాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి..

మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

సినిమాల‌కు.. ఇక సెల‌వు! నటనకు వీడ్కోలు.. పలికిన న‌టి తులసి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2025 | 10:37 AM