Share News

Memory Power: చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..

ABN , Publish Date - May 26 , 2025 | 09:45 AM

Brain Health Tips: చిన్న విషయాలూ గుర్తుండటం లేదని బాధపడుతున్నారా? ఏకాగ్రతగా పనులు చేసుకోలేక సతమతమవుతున్నారా? అయితే, మీ దినచర్యలో ఈ పనులను భాగం చేసుకోండి. మెదడు ఆరోగ్యం మెరుగై జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించవు. మతిమరుపు అనే సమస్యే రాదు.

Memory Power: చిన్న విషయాలూ మర్చిపోతున్నారా? ఈ రోజువారీ అలవాట్లతో సూపర్ మెమొరీ..
Tips To Boost Memory and Concentration

Tips To Boost Memory and Concentration: మన మెదడు శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది శరీరంలోని వివిధ విధులను నియంత్రిస్తుంది. జ్ఞాపకశక్తిని నిల్వ చేసేది ఇదే . అందువల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కీలకం. రోజూ సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం వంటి పనుల వల్ల మెదడు చక్కగా పనిచేస్తుంది. వీటితో పాటుగా ఈ కింది అలవాట్లను దినచర్యలో తప్పక భాగం చేసుకోవాలి. అప్పుడే చిన్నవయసులోనే మతిమరుపు అనే సమస్య రాదు.


మంచి నిద్ర

మెదడు సక్రమంగా పని చేయాలంటే నిద్ర చాలా ముఖ్యం. గాఢ నిద్రలోనే మెదడు జ్ఞాపకాలను స్టోర్ చేస్తుంది. బ్రెయిన్ సెల్స్ పై ఒత్తిడి తొలగిపోయేది అప్పుడే. మెదడు తిరిగి రిఫ్రెష్ అవ్వాలంటే ప్రతి రాత్రి 7–9 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్ర సరిగా లేకపోవడం వల్లే పనులపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గిపోతాయి. ఆలోచనా సామర్థ్యం మందగించి జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయి.


ఆరోగ్యకరమైన ఆహారాలు

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. కొవ్వు చేపలు, బ్లూబెర్రీస్, ఆకుకూరలు, గింజలు, తృణధాన్యాలు వంటి ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. మతిమరపు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే డీహైడ్రేషన్ ఏకాగ్రతని ప్రభావితం చేస్తుంది.


వ్యాయామం

శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. కొత్త నాడీ కనెక్షన్ల పెరుగుదలకు సహాయపడుతుంది. రోజుకు 30 నిమిషాలు వేగంగా నడవడం కూడా ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించి దీర్ఘకాలం పాటు మెదడు అద్భుతంగా పనిచేసేందుకు దోహదపడుతుంది.


ఒత్తిడి

దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్‌ను విడుదల చేస్తుంది. ఇది మీ జ్ఞాపకశక్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మెదడులోని హిప్పోకాంపస్‌ను దెబ్బతీస్తుంది. జర్నలింగ్, సంగీతం వినడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి ఒత్తిడి తగ్గించే అలవాట్ల వల్ల మీరు మానసిక ప్రశాంతత పొందుతారు. ఒత్తిడి అధిగమించి స్పష్టమైన ఆలోచనలు చేయగలరు. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మతిమరుపుతో పాటుగా ఒంటరితనం, కుంగుబాటు సమస్యలు కూడా జయించగలుగుతారు.


స్థిరమైన దినచర్య

క్రమబద్ధమైన దినచర్యను కలిగి ఉండటం వలన అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. పని, భోజనం, విరామాలు వంటి పనులకు రోజూ ఒకే సమయాన్ని కేటాయించడం వలన ఏకాగ్రత మెరుగుపడుతుంది. మెమొరీ పవర్ పెరిగి మరింత చురుగ్గా తయారవుతారు.


మైండ్‌ఫుల్‌నెస్, ధ్యానం

దీర్ఘ శ్వాస, ధ్యానం వంటి మైండ్‌ఫుల్‌నెస్ పద్ధతులు మీ మనస్సును సజీవంగా ఉంచుతాయి. ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మెదడులో బూడిద రంగు పదార్థం పెరుగుతుందని తేలింది. ఇది జ్ఞాపకశక్తి పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


సామాజిక సంబంధాలు

ఇతరులతో సంభాషించడం వల్ల మీ మనస్సు ఉత్తేజితమవుతుంది. మెమొరీని దెబ్బతీసే ఒంటరితనం, నిరాశ భావనలు తగ్గుతాయి. నలుగురితో కలివిడిగా ఉండటం వల్ల ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. మెదడు రిలాక్స్ అయ్యి చకచకా పనులు పూర్తిచేసుకోగలుగుతారు. జ్ఞాపకశక్తి క్షీణించడం అనే సమస్యే రాదు .


Also Read:

అల్లం ఇలా వాడితే కీళ్లనొప్పులు పరార్..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 26 , 2025 | 10:38 AM