Best Drinks For Sleep: నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోమ్ డ్రింక్స్ మీ కోసమే.!
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:53 PM
నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే, ఈ హోమ్ డ్రింక్స్ మీకు ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిద్రలేమికి అనేక కారణాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు, అలాగే కొన్ని వైద్య పరిస్థితులు, జీవనశైలి అలవాట్లు నిద్రలేమికి కారణమవుతాయి. ఈ సమస్య నుండి బయటపడటానికి ఎక్కువగా మందులు వేసుకుంటారు. అయితే, మందుల కన్నా కూడా ఈ సహజమైన పానియాలు నిద్ర కలిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రాత్రిపూట తాగితే మానసికంగా రిలాక్స్ అవుతారని, నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుందని, మెరుగైన నిద్ర వస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెచ్చని పాలు
వెచ్చని పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య ఉన్నవారికి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే పదార్థం నిద్రకు అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. పాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. కాబట్టి, రాత్రి పాలు తాగితే బాగా నిద్ర వస్తుంది.
టార్ట్ చెర్రీ జ్యూస్
టార్ట్ చెర్రీ జ్యూస్ నిద్రలేమికి సహాయపడుతుంది. టార్ట్ చెర్రీ జ్యూస్‌లో మెలటోనిన్ ఉంటుంది, ఇది నిద్రకు సహాయపడే హార్మోన్. ఇది రాత్రిపూట శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధం చేస్తుంది. రోజు పడుకునే ముందు అర కప్పు తాగితే, మంచి నిద్ర వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చమోమిలే టీ
చమోమిలే టీ నిద్రలేమికి సహాయపడుతుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహాయపడే హెర్బల్ టీ. ఇది శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అపిజెనిన్ అనే పదార్థం నిద్రను ప్రేరేపిస్తుంది. పడుకునే 30 నిమిషాల ముందు తాగండి.
వలేరియన్ రూట్ టీ
వలేరియన్ రూట్ టీ అనేది వలేరియన్ మొక్క నుండి తయారు చేయబడిన ఒక హెర్బల్ టీ. ఇది నిద్రలేమి, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. ఇది సహజమైన నిద్ర మాత్రలా పనిచేస్తుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది.
అరటిపండు-బాదం స్మూతీ
అరటిపండు, బాదం రెండు కలిపి తయారుచేసే స్మూతీ నిద్రకు చాలా మంచిది. ఇవి మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ వంటి నిద్రకు ఉపయోగపడే పదార్థాలను అందిస్తాయి.
నిద్రకు అంతరాయం కలిగించే పానీయాలు
కాఫీ, టీ, సోడాలు.. వీటిలో కెఫిన్ ఉండటం వల్ల నిద్ర రాదు
ఆల్కహాల్: మొదట నిద్ర వచ్చేలా అనిపించినా తర్వాత నిద్ర అంతరాయం కలుగుతుంది
చక్కెర ఎక్కువగా ఉన్న డ్రింక్స్: రాత్రిపూట మేల్కొనడానికీ హార్మోన్ల అసమతుల్యతకీ కారణం అవుతుంది. కాబట్టి, నిద్ర సమస్యను మందులతో కాకుండా, ఇంట్లోనే సహజమైన పదార్థాలతో పరిష్కరించవచ్చు.
Also Read:
గుడ్డు పగలకుండా ఎలా ఉడకబెట్టాలి?
For More Lifestyle News