Frozen Foods: పండ్లు, కూరగాయలు, మాంసం.. ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు?
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:05 PM
ఫ్రిజ్‌లో పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి ఎక్కువగా పెడతాం. అయితే, ఇలా వాటిని ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు? వాటిని ఎక్కువ రోజులు అలానే ఉంచి ఉపయోగిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను నిల్వ చేయడం సాధారణం. పండ్లు, కూరగాయలు, మాంసం వంటి వాటిని ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, పాడైపోకుండా ఉండటానికి ఫ్రిజ్‌లో ఉంచుతాం. అయితే, అన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మంచిది కాదు. కొన్ని ఆహారాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి రుచి, నాణ్యత దెబ్బతింటాయి. పాలు, పెరుగు, గుడ్లు, కూరగాయలు, పండ్లు, మాంసం, మిగిలిపోయిన ఆహారం వంటి వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఇవి ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, టమోటాలు ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు. అయితే, ఫ్రిజ్‌లో ఉంచిన వాటిని ఎంత కాలం నిల్వ చేయొచ్చు? వాటిని ఎక్కువ రోజులు అలానే ఉంచి ఉపయోగిస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
3 నుండి 4 రోజులు
ఎక్కువ కాలం ఆహార పదార్ధాలను ఫ్రిజ్‌లో ఉంచితే వాటి పోషక విలువలు తగ్గిపోతాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలకంటే హాని ఎక్కువ కలుగుతుంది. కాబట్టి, కూరగాయలు, పండ్లు 3 నుండి 4 రోజులు మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎక్కువ రోజులు వాటిని ఫ్రిజ్‌లో ఉంచి ఉపయోగిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు.
24 గంటల్లోపు
మీరు తరిగిన పండ్లను ఫ్రిజ్‌లో ఉంచితే, వాటిని 6 గంటలలోపు తినాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అన్నం, పప్పు, రోటీ వంటివి ఏదైనా రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే వాటిని 24 గంటల్లోపు ఉపయోగించాలి. వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి రెండ్రోజుల తర్వాత తింటే గ్యాస్ లేదా అజీర్ణ సమస్యలు కలుగవచ్చు.అలాగే బ్రెడ్‌ను ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచి తినడం వల్ల కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రెండు రోజులు మాత్రమే
కూరగాయల లాగానే సాధారణంగా నాన్ వెజ్‌ను కూడా అందరూ ఫ్రిజ్‌లోనే స్టోర్ చేస్తారు. అయితే, వాటిని ఎక్కువ రోజులు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. వీటిని గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి. నాన్ వెజ్ పదార్థాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసేటప్పుడు శుభ్రత, ఉష్ణోగ్రత నియంత్రణ చాలా ముఖ్యం. మాంసాన్ని ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే నిల్వ చేయాలి. లేదంటే దాని పోషకాలు తగ్గి ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది.
అయితే, ఈ వర్షాకాలంలో ఎప్పటికప్పుడు వంట చేసుకొని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆహార సంబంధిత సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. ఈ వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రత మార్పులు బ్యాక్టీరియా, వైరస్‌లు పెరిగేందుకు అనుకూలంగా ఉంటాయి. తద్వరా ఆహారం త్వరగా పాడై కలుషితమవుతుంది. కాబట్టి, ఆహార పదార్ధాలను ఎక్కువగా స్టోర్ చేయకుండా, ఫ్రెష్‌గా ఉన్నవి మాత్రమే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
గుడ్డు పగలకుండా ఎలా ఉడకబెట్టాలి?
For More Lifestyle News