Share News

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

ABN , Publish Date - Jul 04 , 2025 | 08:44 AM

ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది.

JNTU: బీటెక్‌లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌..

- జేఎన్‌టీయూ కొత్త సిలబ్‌సలో చేర్చాలని నిపుణుల నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ: ఈ తరం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు భవిష్యత్తు తరం (నెక్స్ట్‌ జెనరేషన్‌) టెక్నాలజీస్)ను బోధించేలా జేఎన్‌టీయూ సిలబస్‌ రూపుదిద్దుకుంటోంది. నాలుగేళ్ల ఇంజనీరింగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌) కోర్సుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు అమితంగా ఆసక్తి చూపుతున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), డేటా సైన్స్‌ (డీఎస్‌) వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీతో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తున్న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను కూడా సిలబ్‌సలో చేర్చాలని తాజాగా నిర్ణయించారు.


ప్రపంచంతో పోటీపడే విధంగా ఇంజనీరింగ్‌ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు జేఎన్‌టీయూ ఆర్‌25 రెగ్యులేషన్స్‌ కింద కొత్త సిలబ్‌సను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీబీసీఎస్‌ విధానం, నచ్చిన సబ్జెక్టులను ఎంచుకునేందుకు క్రెడిట్స్‌ మినహాయింపు, నాన్‌ క్రెడిట్‌ కోర్సులకు క్రెడిట్స్‌ వర్తింపు, మ్యాథమేటిక్స్‌లో ల్యాబ్‌ పరీక్షలు వంటి సంస్కరణలను సిలబ్‌సలో చేర్చిన వర్సిటీ ఉన్నతాధికారులు తాజాగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను కూడా ఒక యూనిట్‌గా లేదా ఒక సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయానికి వచ్చారు. మరో రెండ్రోజుల పాటు సమావేశంలో చర్చించిన మీదట కొత్త సిలబ్‌సను అధికారులు అందుబాట్లోకి తీసుకురానున్నారు.


సిలబస్‌ రూపకల్పనపై కసరత్తు

యూనివర్సిటీ అకడమిక్‌ అఫైర్స్‌ విభాగం ఆధ్వర్యంలో సిలబస్‌ రూపకల్పనపై గురువారం తుది కసరత్తు ప్రారంభమైంది. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ సమావేశాల్లో ఇండస్ట్రీ, అకడమిక్‌ ఎక్స్‌పర్ట్స్‌ నుంచి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌కు అధిక ప్రాధాన్యతను ఇస్తుండడం, ఇప్పటికే ఆ రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు కొందరు సభ్యులు బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్ల దృష్టికి తెచ్చారు.


city5.2.jpg

దీంతో ఈ ఏడాది నుంచి అమల్లోకి రానున్న బీటెక్‌ సిలబ్‌సలో తప్పనిసరిగా క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను చేర్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను కంప్యూటర్‌ సైన్స్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాలకే పరిమితం చేయాలని భావించగా, సివిల్‌, మెకానికల్‌ విద్యార్థులు, ఆచార్యుల నుంచి ఈ సబ్జెక్టు కోసం డిమాండ్‌ వచ్చినట్లు తెలిసింది. సంక్లిష్టమైన ఆప్టిమైజేషన్‌ సమస్యలను అత్యంత సులువుగా పరిష్కరించగలిగే సత్తా క్వాంటమ్‌ కంప్యూటర్స్‌కు ఉంటుందని,


ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్లాసికల్‌ కంప్యూటర్ల కంటే క్వాంటమ్‌ కంప్యూటర్లు అత్యంత భద్రత, లక్షల రెట్ల వేగంతో పనిచేస్తాయని ఫిజిక్స్‌ విభాగం ఆచార్యుడు ఒకరు వెల్లడించారు. ప్రపంచమంతా క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ కోసం ఎదురుచూస్తున్నందున వర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఒక కోర్సుగా ప్రవేశపెడితే బాగుంటుందని కంప్యూటర్‌ సైన్స్‌ విఽభాగానికి చెందిన ఒకరిద్దరు ప్రొఫెసర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

కాటేదాన్‌ రబ్బర్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 04 , 2025 | 08:44 AM