Pilot Career: ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్స్ కావచ్చు.. ఎలాగంటే..
ABN , Publish Date - May 29 , 2025 | 12:22 PM
Pilot Course New Rules: ఇన్నాళ్లూ కొన్ని కోర్సులు చదివే విద్యార్థులకు మాత్రమే పైలట్ అయ్యే ఛాన్స్ ఉండేది. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులూ పైలట్ కలను సాకారం చేసుకోవచ్చు. ఎలాగంటే..

How to Be a Pilot after 12th: పైలట్ కోర్సు చదివేందుకు ఇప్పుడు కేవలం సైన్స్ విద్యార్థులే కాదు. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా అర్హులే. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కొత్త ట్రైనింగ్ పాలసీ నిబంధనల ప్రకారం ఇకపై సోషల్ చదివిన వారూ కూడా పైలట్ కెరీర్ ఎంచుకోవచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కోసం శిక్షణ పొందవచ్చు. వేలాది మంది యువతకు పైలట్ కలను సాకారం చేసుకునేందుకు ఇదో గొప్ప ఛాన్స్. గతంలో ఈ అవకాశం 12వ తరగతి లేదా ఇంటర్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదివిన విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండేది.
అమల్లోకి వచ్చేదెప్పుడు?
ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) శిక్షణ తీసుకోవడానికి అనుమతించాలని DGCA కేంద్ర పౌరవిమానయాన శాఖకు సిఫార్సు చేసింది. మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదన న్యాయ మంత్రిత్వ శాఖకు వెళుతుంది. ఆ తర్వాతే ఈ కొత్త నియమం అమల్లోకి వస్తుంది. నియమాలు సవరించిన తర్వాత 12వ తరగతి పాసై వైద్య ఫిట్‌నెస్, ఇతర పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఏ విద్యార్థి అయినా పైలట్ కావడానికి అర్హులుగా పరిగణించబడతారు.
30 సంవత్సరాల తర్వాత..
1990ల మధ్యకాలం నుంచి ఇప్పటి వరకూ భారతదేశంలో CPL శిక్షణ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ఇచ్చేవారు. ఇంతకు ముందు ఈ ట్రైనింగ్ కోసం 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసేవారు. ఆ తర్వాత చాలా మంది సీనియర్ పైలట్లు దీనిని కాలం చెల్లిన, పనికిరాని నిబంధనగా అభివర్ణించడంతో రూల్స్ మార్చారు. ఇక సైన్స్ విద్యార్థులకే అనే నిబంధన కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు CPL శిక్షణ పొందడానికి భౌతిక శాస్త్రం, గణిత పరీక్షలు రాస్తున్నారు. పాసైన తర్వాత CPL శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ ఇకపై అలా ఉండబోదు. సైన్స్ విద్యార్థుల మాదిరిగానే ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులు కూడా నేరుగా పైలట్‌లుగా మారడానికి అర్హులు. రానున్న రోజుల్లో సైన్స్ కోర్సు చేయని విద్యార్థులు కూడా వాణిజ్య విమానాలను నడిపించడం త్వరలోనే చూడవచ్చు.
ఇవీ చదవండి:
ఎయిర్‌ఫోర్స్ కొత్త నోటిఫికేషన్.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..
ఎయిర్ హోస్టెస్ కావాలనుకుంటున్నారా ?
మరిన్ని ఎడ్యుకేషన్, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి