Sawan Shivratri 2025: శ్రావణ మాసంలో శివానుగ్రహం కోసం పఠించాల్సిన మంత్రాలివే..
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:34 AM
హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదంతా ఎన్నో పండుగలు వస్తూనే ఉంటాయి. అయితే, సంవత్సరంలో ప్రతి నెలా వచ్చే ప్రత్యేకమైన పర్వదినం మాస శివరాత్రి. ఈ రోజున పరమేశ్వరుని నిష్ఠతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి.. కోరిన కోర్కెలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా మాస శివరాత్రి నాడు ఈ మంత్రాలను పఠించే భక్తులకు శివానుగ్రహం దక్కుతుందని అంటారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం, సంవత్సరంలో ప్రతి నెలా మాస శివరాత్రి వస్తుంది. ప్రతి నెలా అమావాస్యకు ముందు రోజున బహుళ చతుర్దశి నాడు మాసశివరాత్రిని జరుపుకుంటారు. ఏకాదశి నాడు విష్ణుభక్తులు ఉపవాసం ఉన్నట్టే.. మాస శివరాత్రినాడు శివభక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉపవాసం, జాగరణ చేస్తారు. అయితే, మాఘమాసంలో వచ్చే మాసశివరాత్రిని మాత్రం మహాశివరాత్రి అని పిలుస్తారు. శివపురాణం ప్రకారం ఈ రోజునే మహేశ్వరుడు జగన్మాతను పెళ్లాడాడు. మాసశివరాత్రినాడు భక్తులు ఈ మంత్రాలు పఠిస్తూ భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తే సర్వపాపాలు తొలగిపోయి అనంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
శ్రావణ మాసం జులై 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 23 వరకు ఉంటుంది. మాస శివరాత్రి ప్రతి నెలా కృష్ణ పక్షంలో చతుర్దశి తిథి నాడు వస్తుంది. ఈ శ్రావణ మాసంలో మాస శివరాత్రి ఆగస్టు 4వ తేదీన వస్తుంది. ఈ పవిత్రమైన రోజున నిష్ఠతో శివ పూజ చేసే భక్తులు నీలకంఠునికి ప్రీతిపాత్రువులతారు. మీ కష్టాలన్నీ పటాపంచలు అయిన కోరిన కోర్కెలు నెరవేరాలంటే ఈ మంత్రాలు పఠించాలి. ఇవి కేవలం శ్లోకాలు కావు. ఈ మంత్రాలు ఉచ్ఛరించడం వల్ల ఆత్మను శుద్ధి జరుగుతుంది. శరీరానికి స్వస్థత చేకూరుతుంది. మనలో దైవిక చైతన్యాన్ని మేల్కొలిపే శక్తి ఈ మంత్రాలకు ఉందని పురాణాలు చెబుతున్నాయి.
1. ఓం నమః శివాయ - పంచాక్షరీ మంత్రం
ఓం నమః శివాయ అంటే 'నేను శివుడికి నమస్కరిస్తున్నాను' అని అర్థం. ఈ ఐదు అక్షరాల మంత్రాన్ని సమస్త వేద జ్ఞానానికి సారాంశంగా పరిగణిస్తారు. ఈ మంత్రం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. గత కర్మలను శుద్ధి చేసి ఆత్మను నేరుగా దైవిక శక్తితో అనుసంధానించే సార్వత్రిక మంత్రం. మాసశివరాత్రినాడు తెల్లవారుజామున లేదా రాత్రి పూజ చేసే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది.
2. మహా మృత్యుంజయ మంత్రం- మరణాన్ని జయించే మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్.
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మాతృమృతాత్॥
అర్థం: 'సువాసన భరితుడు, అన్ని జీవులను పోషించే మూడు నేత్రాలు కలిగిన శివుడిని మేము పూజిస్తున్నాము. అమరత్వం కొరకు ఆయన మనలను మరణం నుంచి విముక్తి చేయుగాక'
ఈ శక్తివంతమైన మంత్రం స్వస్థత, రక్షణ, భయాన్ని జయించడం కోసం పఠిస్తారు. దీన్ని తరచుగా శారీరక, మానసిక స్వస్థత కోసం, అకాల మరణం, దురదృష్టాన్ని నివారించడానికి జపిస్తారు.అర్ధరాత్రి లేదా శివరాత్రి నాడు మూడవ, నాలుగు గంటల సమయంలో పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
3. శివ గాయత్రి మంత్రం - ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్॥
అర్థం: 'మేము సర్వోన్నత పురుషుడిని, గొప్ప దేవుడిని ధ్యానిస్తున్నాము. రుద్రుడు మనల్ని ప్రేరేపించి, జ్ఞానోదయం కలిగించుగాక'.
విద్యార్థులకు, సాధకులకు ఈ మంత్రం అనువైనది. ఏకాగ్రత, స్పష్టత, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇది శివుడిని విశ్వ గురువుగా ఆవాహన చేస్తుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా ధ్యానం చేసేటప్పుడు జపించాలి.
4. రుద్ర మంత్రం - ప్రతికూలతను తొలగించడానికి
ఓం నమో భగవతే రుద్రాయ
అర్థం: 'నేను మహాశక్తిమంతుడైన రుద్రుడికి (శివుని ఉగ్ర రూపం) నమస్కరిస్తున్నాను'.
ఈ మంత్రం ప్రతికూల శక్తులను, దుష్ట శక్తులను, అంతర్గత గందరగోళాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు. దీన్ని మాస శివరాత్రి సమయంలో పఠిస్తే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉపవాసం కోసం సంకల్పం తీసుకునే ముందు, అభిషేకానికి ముందు ఈ మంత్రం పఠించాలి.
5. శివ ధ్యాన మంత్రం - పూజ, ధ్యానం ప్రారంభించడానికి
కరచరణం కృతం వాక్కాయజం కర్మజం వా.
శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్॥
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ ।
జయ జయ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో॥
అర్థం: తెలిసి, తెలియక చేసిన అన్ని పాపాలకు - శరీరం, వాక్కు, మనస్సు, కర్మలకు క్షమాపణ కోరే ప్రార్థన.
మీ మనస్సు, ఆత్మను శుద్ధి చేసుకోవడానికి శివపూజ ప్రారంభించే ముందు దీనిని జపించండి. ఇది హృదయద్వారాలను తెరచి మనసంతా భక్తితో నింపేస్తుంది.
6. లింగాష్టకం స్తోత్రం - శివలింగాన్ని పూజించడానికి ఎనిమిది శ్లోకాలు
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాషిత శోభిత లింగం... అంటూ సాగే లింగాష్టక స్తోత్రాన్ని శివలింగ అభిషేకం సమయంలో పఠించడం వల్ల ఆధ్యాత్మికతకు దగ్గరవుతారు. గత జన్మల దోషాలు లేదా పాపాలు తొలగిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆగస్టులో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? రూ.300 టిక్కెట్ లభించకపోతే ఇలా ట్రై చేయండి!
For More Devotional News And Telugu News