Student: మార్కులపై తండ్రి మందలించాడని..
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:59 AM
మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
- బాలిక ఆత్మహత్య
హైదరాబాద్: ‘మొన్న గణితంలో తక్కువ మార్కులు వచ్చాయి.. బాగా చదువు.. నీ కోసమే చెబుతున్నాం..’ అని తండ్రి చేసిన మందలింపు ఆమెను చిన్నారి మనసును తీవ్రంగా కలచివేసింది. అందులోనూ పదో తరగతి కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయింది. అందరూ నిద్రలో ఉండగా అపార్ట్‌మెంట్ టెర్రస్ నుంచి దూకి తనువు చాలించింది. ఈ విషాదకర సంఘటన హబ్సిగూడలో మంగళవారం చోటు చేసుకుంది. ఓయూ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హబ్సిగూడ స్ర్టీట్ నంబర్ 1, కాకతీయనగర్‌లోని జ్యోతి ఎమెరాల్డ్ అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కె.సుకుమార్ రెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలతో ఉంటున్నాడు. పెద్ద కుమార్తె సిరి వైష్ణవి(15) పదో తరగతి చదువుతోంది. ఇటీవల గణితంలో తక్కువ మార్కులు రావడంతో సోమవారం రాత్రి తండ్రి మందలించాడు. చదువుపై దృష్టి పెట్టాలని, ఇంకాస్త ఎక్కువ సమయం చదవాలని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సిరి వైష్ణవి చదువు ఒత్తిడి తట్టుకోలేకపోయింది.
అమ్మా, నాన్న, చెల్లి అందరూ గాఢనిద్రలో ఉండగా తెల్లవారుజామున వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ టెర్ర్‌స(నాలుగు అంతస్తుల భవనం)పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతికి సంతాపంగా ఆమె చదువుతున్న పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News