Share News

US Imposes Sanctions: ఆరు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. అసలు కారణమిదే..

ABN , Publish Date - Jul 31 , 2025 | 10:40 AM

అమెరికా మరోసారి తన ఆంక్షల దండయాత్రను కొనసాగించింది. ఈసారి లక్ష్యంగా మారిన వాటిలో ఆరు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. అసలు ఎందుకు ఆంక్షలు విధించిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

US Imposes Sanctions: ఆరు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు.. అసలు కారణమిదే..
US Imposes Sanctions india

అమెరికా ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రభుత్వం మొత్తం 6 భారతీయ కంపెనీలపై ఆంక్షలు (US Imposes Sanctions india) విధించింది. ఎందుకంటే ఈ కంపెనీలు ఇరాన్ నుంచి చమురు, పెట్రో రసాయన ఉత్పత్తులు కొనుగోలు చేశాయన్న ఆరోపణలతో నిర్ణయం తీసుకున్నారు.

అమెరికా ఏమంటోంది

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకారం ఇరాన్ ప్రభుత్వం ఆర్థిక ఆదాయాన్ని మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెంచడానికి, ఉగ్రవాదాన్ని నడిపేందుకు, ప్రజలపై ఒత్తిడి తెచ్చేందుకు వినియోగిస్తోంది. అందుకే అలాంటి ఆదాయ మార్గాలను మేము కట్ చేస్తున్నామని అమెరికా తెలిపింది.


ఏ కంపెనీలపై చర్యలు తీసుకున్నారు?

ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున చమురు, మిథనాల్, టోల్యూన్, పాలిథీన్ వంటివి దిగుమతి చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో మొత్తం 6 భారత కంపెనీల పేర్లను అమెరికా వెల్లడించింది. వాటిలో

  • ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్: 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు 84 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు ఆరోపణ.

  • గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్: 2024 జూలై నుంచి 2025 జనవరి వరకు 51 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్‌తో సహా ఇరాన్ ఉత్పత్తులను కొనుగోలు చేసిందని ఆరోపణ.

  • జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్: టోలుయెన్‌తో సహా 49 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు ఆరోపణ.

  • రమణీక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ: 22 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్, టోలుయెన్‌లను కొనుగోలు చేసినట్లు ఆరోపణ.

  • పెర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్: 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు 14 మిలియన్ డాలర్ల విలువైన మిథనాల్ దిగుమతి చేసినట్లు ఆరోపణ.

  • కాంచన్ పాలిమర్స్: 1.3 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పాలీథీన్ ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఆరోపణ.


ఈ సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు

అమెరికాలో ఉన్న ఈ కంపెనీల అన్నీ ఆస్తులు ఫ్రీజ్ చేయబడతాయి. అమెరికా పౌరులు, కంపెనీలు వీటి‌తో ఎలాంటి వ్యాపారం చేయలేరు. ఈ కంపెనీలకు 50% పైగా వాటా ఉన్న ఇతర కంపెనీలపై కూడా ఆంక్షలు వర్తిస్తాయి.

ఎందుకు ఈ చర్యలు?

అమెరికా ప్రకారం ఇరాన్ తన చమురు & పెట్రో కెమికల్ ఆదాయాన్ని ఉగ్రవాదానికి సహకరించే సంస్థలకు, గల్ఫ్ ప్రాంతంలోని వివాదాలకు నిధులు సమకూర్చేందుకు ఉపయోగిస్తోందట. అందుకే చమురు రవాణా లేదా మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న కంపెనీలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది.

భారత్ – ఇరాన్ సంబంధం?

భారతదేశం గతంలో ఇరాన్‌తో మంచి వ్యాపార సంబంధాలు కొనసాగించింది. అయితే, 2019 తర్వాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ చమురు దిగుమతులు భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ తాజా కేసుతో భారత్-అమెరికా వ్యాపార సంబంధాలపై ప్రభావం ఉండొచ్చు అనే చర్చ మొదలైంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 31 , 2025 | 10:54 AM