Financial Plan For Family : 50:30:20 రూల్ పాటిస్తే.. మీ అప్పులు తీరి ధనవంతులవుతారు..
ABN , Publish Date - Jan 28 , 2025 | 05:04 PM
50:30:20 రూల్ గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇది ఫాలో అయితే మీ అప్పులు తీరి జీవితాంతం ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావు. కాబట్టి, మీ కుటుంబమంతా హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ నియమం పాటిస్తే చాలు.

మనం ప్రతి నెలా ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనే దాన్ని బట్టే భవిష్యత్ జీవితం ఆధారపడి ఉంటుంది. అవసరం లేకపోయినా చాలామంది ఎడాపెడా అప్పులు చేయడం, గొప్ప కోసం ఇన్‌స్టాల్‌మెంట్లలో కనిపించినవన్నీ కొనడం చేస్తుంటారు. తర్వాత ఈఎంఐలు ఎలా తీర్చాలో తెలియక నానా తంటాలు పడటం చూసే ఉంటారు. ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని సరైన పొదుపు పాటించకపోతే కష్టాల ఊబిలోకి అడుగుపెడుతున్నారని అర్థం. కాబట్టి, సంపాదనలో ఎంత పోగేస్తున్నాం.. అత్యవసర ఖర్చులకు ఎంత వెనకేసుకున్నాం..రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవించేంత పొదుపు చేస్తున్నామా అనేది లెక్కవేసుకోవాలి. అందుకు, 50:30:20 రూల్ ది బెస్ట్ వే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మీ కుటుంబమంతా హ్యాపీగా ఉండాలంటే లేట్ చేయకుండా ఈ నియమం వెంటనే అమల్లో పెట్టాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న నిత్యావసర ఖర్చులు, జీవన వ్యయం, అధిక వడ్డీ రేట్లు ప్రతి కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు చేయాలనే కోరిక, తపన ఉన్నా కొన్నిసార్లు సరిపడినంత మిగలదు. ఎలా పొదుపు చేయాలో కొందరికి అవగాహన ఉండదు. 50:30:20 నియమం ప్రకారం కుటుంబ ఖర్చులు విభజించుకుంటే మీ భవిష్యత్తు ఆర్థిక ఒడుదొడుకులు లేకుండా సజావుగా సాగుతుంది.
50:30:20 రూల్ అంటే ఏమిటి ?
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నియమం ద్వారా స్థిరమైన ఆదాయం, పెన్షన్ ప్లానింగ్ రెండింటికీ వర్తిస్తుంది. మీకొచ్చే ఆదాయంలో 50% అవసరాలకు అంటే మనం జీవించేందుకు అవసరమయ్యే ఇంటి బాడుగ లేదా రుణం, తిండి, బట్టలు, ఈఎమ్ఐలు, బీమా, పిల్లల చదువు, వాహన ఖర్చులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఇందులో వస్తాయి. 30% కోరికలకు కేటాయించాలి. విహారయాత్రలు, సరదాలు సంతోషాలు, సినిమాలు, కొత్త వస్తువులు, వాహనాల కొనుగోలు లాంటివి. 20% పొదుపు, పెట్టుబడులకు. అత్యవసర ఖర్చులు, పొదుపు స్కీంలు, మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, బంగారం కొనుగోలు చేయడం లాంటివి. అప్పులు చెల్లించుకుంటూనే పొదుపుకూ తప్పక కొంత మొత్తాన్ని కేటాయించడం తప్పక అలవాటు చేసుకోవాలి.
ఈ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే ఆటోమేటిక్‌గా కొన్నాళ్లు గడిచేసరికి మీ అప్పులు తీరడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ప్రజలు తమ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో, భవిష్యత్తు అవసరాలకు సిద్ధమయ్యేందుకు ఈ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది. వ్యక్తుల అవసరాలు, ఆదాయం బట్టి ప్రణాళికలు మారవచ్చు. వీలైతే ఆర్థిక సలహాదారును సంప్రదించడం మంచిది. అయితే, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారికి లేదా ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి ఇది అంతగా సహాయపడకపోవచ్చు. ఇలాంటి వారు తమ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఇతర అవకాశాలను అన్వేషించాలి. ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టడం మేలు చేకూర్చవచ్చని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.