OPEC+ Crude Oil Supply: ఒపెక్+ బిగ్ మూవ్.. భారీగా తగ్గనున్న క్రూడాయిల్..!
ABN , Publish Date - Jul 06 , 2025 | 01:29 PM
OPEC+ Oil Supply Hike August: చమురు ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్+) శనివారం జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 548,000 బ్యారెళ్లకు పెంచేందుకు సమిష్టిగా అంగీకారం తెలిపాయి.

OPEC+ Crude Oil Supply: ఒపెక్+ గ్రూపులోని ఎనిమిది చమురు ఉత్పత్తి దేశాలు శనివారం జరిగిన సమావేశంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. ముడి చమురు ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించాయి. వచ్చే నెల ఆగస్టు నుంచి రోజుకు 548,000 బ్యారెళ్లు అదనంగా ఉత్పత్తి చేస్తామని ఒపెక్ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్, యుఎస్ ఉమ్మడిగా ఇరాన్‌పై దాడులు జరిపిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతరం పెరిగి.. ఆపై పడిపోయిన నేపథ్యంలో చమురు ఉత్పత్తి దేశాలు ఈ సమావేశం నిర్వహించాయి. అయితే, ఒపెక్+ గతంలోనే ఈ ఏడాది మే, జూన్, జులై నెలల్లో రోజుకు 4,11,000 బ్యారెళ్ల చమురును అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం ముడిచమురు ఉత్పత్తి దాదాపు మూడు రెట్లు పెరగనుంది.
సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్+ సభ్య దేశాలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. శనివారం జరిగిన వర్చువల్ సమావేశంలో స్వచ్ఛంద ఉత్పత్తి కోతలను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా చమురుకు ధర తక్కువగా ఉన్నప్పటికీ రోజువారీ ఉత్పత్తిని మరింత పెంచాలని నిశ్చయించుకున్నాయి.22 దేశాల సమూహంలోని ఎనిమిది దేశాలైన సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యుఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించాయి. ఈ ఏడాది ఆగస్టు నుంచి రోజూ అదనంగా 548,000 బ్యారెళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా షేల్ ఉత్పత్తిదారుల నుంచి పోటీని తట్టుకోవడం, ప్రపంచ మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచానికి ముడిచమురు అవసరాల్లో సగభాగం ఒపెక్+ దేశాలే తీరుస్తుండటం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Read Latest Telangana News and National News