YS Sharmila : ఇకనైనా సాయిరెడ్డి నిజాలు చెప్పాలి
ABN , Publish Date - Jan 26 , 2025 | 03:40 AM
వివేకా హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి, మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు.

ఇన్నాళ్లూ జగన్ చెప్పినట్టల్లా చేశారు
ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే
నా బిడ్డలను కూడా వదల్లేదు
జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయినందుకే ఈ రాజీనామా
తనను కాపాడుకోవడానికే సాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారు: షర్మిల
అమరావతి/విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జగన్ నాయకుడిగా విశ్వసనీయతను కోల్పోయినందునే విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోయారని పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. గతంలో విజయసాయి చెప్పినవన్నీ అబద్ధ్దాలేనని ఆయనకూ తెలుసన్నారు. వివేకా హత్య విషయంలో నిజాలు చెప్పిన సాయిరెడ్డి, మిగిలిన విషయాలు కూడా బయటపెట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేదంటూ శనివారం విజయవాడ ధర్నా చౌక్‌లో షర్మిల నేతృత్వంలో పీసీసీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జగన్ బీజేపీకి దత్తపుత్రుడు. తనను తాను కాపాడుకోవడానికే విజయసాయిరెడ్డిని బీజేపీలోకి పంపుతున్నారు. జగన్‌కు సాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు. రాజకీయంగానే గాక వ్యక్తిగతంగానూ నా బిడ్డల మీద విజయసాయి అబద్ధాలు చెప్పారు. జగన్‌కు, వైసీపీకి సాయిరెడ్డి దూరం కావడంతో పరిస్థితి ఏమిటో వైఎస్ అభిమానులు, ప్రతి వైసీసీ కార్యకర్త ఆలోచించాలి. నాయకుడిగా జగన్ విశ్వసనీయతను కోల్పోయారు. ప్రజలను మోసం చేశారు. జగన్ నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేకపోతున్నారు’ అని షర్మిల అన్నారు. కాగా, అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు వాటిని అమలు చేయమంటే అప్పులు ఉన్నాయంటూ దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారని షర్మిల ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే
వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే
కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..
For More Andhra Pradesh News and Telugu News..