Share News

Yanamala Ramakrishnudu: ఆగస్టు సంక్షోభం లో స్పీకర్‌గా చేయాల్సిందే చేశా

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:29 AM

42 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని చరిత్రాత్మకంగా గుర్తు చేస్తూ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తన అనుభవాలను పంచుకున్నారు.1995 ఆగస్టు సంక్షోభంలో తన పాత్రను వివరిస్తూ, టీడీపీలో తనకు దక్కిన స్థానం ప్రత్యేకమని అన్నారు

Yanamala Ramakrishnudu: ఆగస్టు సంక్షోభం లో స్పీకర్‌గా చేయాల్సిందే చేశా
Yanamala Rama krishnudu

  • చంద్రబాబుకు ప్రత్యేకంగా మేలు చేయలేదు

  • ఎమ్మెల్యేల బలాబలాలను నేనే లెక్కించా

  • బాబుకు 163 మంది ఎమ్మెల్యేల మద్దతు

  • అందుకే.. అప్పుడు ఆయన సీఎం అయ్యారు

  • ఎన్టీఆర్‌కు మైక్‌ ఇవ్వలేదని నాపై దుష్ప్రచారం

  • స్పీకర్‌గా ఎన్నో కీలకమైన రూలింగ్స్‌ ఇచ్చా

  • 11సార్లు రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టా

  • ఆంధ్రజ్యోతితో యనమల రామకృష్ణుడు

  • 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై నేడు పుస్తకావిష్కరణ

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

‘‘అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చా. ఎన్నో పదవులు అధిరోహించా. 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 38ఏళ్లపాటు నిరాటంకంగా వివిధ పదవులు, హోదాల్లో క్యాబినెట్‌ ర్యాంకులో కొనసాగడం టీడీపీలో నాకు తప్ప మరెవరికీ దక్కని అదృష్టం’’ అని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. యనమల 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై కాకినాడ జిల్లా తునిలో గురువారం పుస్తకావిష్కరణ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నాటి ‘ఆగస్టు సంక్షోభం’లో తన పాత్ర నుంచి నేటి పరిణామాల వరకు యనమల రామకృష్ణుడు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...

‘ఆగస్టు సంక్షోభం’ సమయంలో...

తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్రలో 1995 ఆగస్టు సంక్షోభం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో లక్ష్మీపార్వతి ఆధిపత్య ధోరణి మెజార్టీ ఎమ్మెల్యేలకు నచ్చలేదు. అదే సమయంలో కేంద్రంలో యునైటెడ్‌ ఫ్రంట్‌లో టీడీపీ కీలకంగా ఉంది. కేంద్రంలో ‘ఫ్రంట్‌’ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌ ఉప ప్రధానిగా వెళ్లిపోవచ్చని, సీఎం కుర్చీ లక్ష్మీపార్వతి లాక్కోవచ్చని చాలామంది ఎమ్మెల్యేలు బలంగా నమ్మారు. దీంతో వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. పార్టీని కాపాడుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఆయనను టీడీపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ బులిటెన్‌లో ప్రచురించాల్సిన బాధ్యత మాది. సభ్యులు ఎంతమంది ఎవరివైపు ఉన్నారో లెక్కించి స్పీకర్‌ అనుమతితో నివేదిక పంపాలని అప్పటి గవర్నర్‌ అసెంబ్లీ కార్యదర్శికి లేఖ పంపారు. ఇదంతా... తదుపరి ప్రక్రియను జాప్యం చేయడానికేనని నాకు అర్థమైంది.


ఈ నేపథ్యంలో స్పీకర్‌ హోదాలో ఉన్న నేను అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల బలాలను పేరుపేరునా మీడియా సమక్షంలో లెక్కించా! 163మంది సభ్యుల బలం చంద్రబాబుకు ఉండడంతో ఆయన టీడీఎల్పీ నేతగా, సీఎంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ నాపై కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మైక్‌ ఇవ్వకపోవడంతోపాటు బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే... మెజార్టీ సభ్యులు చంద్రబాబు వెంట ఉండడం, వారంతా టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోవడంతో ఆ హోదా ఉన్నవారినే బీఏసీ సమావేశానికి పిలవాల్సి వచ్చిందని ఎన్టీఆర్‌కు వివరించాను. సభలో అజెండా అంశంపై మాత్రమే మాట్లాడడానికి మైక్‌ ఇవ్వడం కుదురుతుందని ఎన్టీఆర్‌కు తెలిపాను. ఒకరకంగా సభలో స్పీకర్‌గా నా కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాను. ఇందులో చంద్రబాబుకు నేను ప్రత్యేకంగా చేసిన సాయం ఏదీ లేదు. కానీ... ఎన్టీఆర్‌కు కావాలనే మైక్‌ ఇవ్వలేదని కాంగ్రె్‌సతో సహా అనేకమంది నాపై దుష్ప్రచారం చేశారు. ఇప్పటికీ ఈ విషయమై నాకు ఆవేదన ఉంది.

అలా ఆయన దృష్టిలో పడ్డా..

కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీనగరంలో జన్మించాను. చదువుకుంటున్న సమయంలో అప్పట్లో కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఐక్య సంఘంలో పనిచేయడానికి నన్ను ఎంపిక చేశారు. అలా అందులో పోరాడుతున్న సమయంలో ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించి రాష్ట్రమంతటా తిరుగుతున్న క్రమంలో నవంబరులో తుని వచ్చారు. అప్పుడే టీడీపీలో చేరాను. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌ రామకృష్ణా స్టూడియోలో కలిసి వచ్చిన కొన్ని రోజులకు నా విద్యార్హత, సామాజికవర్గం, పోరాటం గురించి ఆరా తీసి తుని అసెంబ్లీ సీటు ప్రకటించారు. అలా అయిష్టంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం, వెంటనే మునిసిపల్‌ మంత్రి కావడం... ఒకేసారి రెండు పదవులతో అసెంబ్లీలోకి అడుగుపెట్టాను. ఏదీ కోరుకోకుండానే రాజకీయాల్లో నాకు అన్నీ జరిగిపోయాయి. ఒకదాని వెంట మరో పదవి వరించింది.


రోశయ్య తర్వాత నాదే ఆ ఘనత

స్పీకర్‌గా ఉన్నప్పుడు ముఖ్యమైన రూలింగ్‌లు ఎన్నో ఇచ్చా. ఇప్పటి స్పీకర్‌లకు అవి రిఫరెన్స్‌లుగా మారుతున్నాయి. అసెంబ్లీ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని నేనే ప్రవేశపెట్టాను. సభ్యులు చాలామంది నన్ను తిట్టినా ఈ విషయంలో వెనకడుగు వేయలేదు. ఏటా ఎమ్మెల్యేలు తమ ఆస్తులు ప్రకటించాలన్న రూలింగ్‌ నా హయాంలో ఇచ్చిందే. నా హయాంలోనే జీరోబేస్డ్‌ బడ్జెట్‌ విధానం ప్రవేశపెట్టాను. నేను మొత్తం 11 సార్లు రాష్ట్ర బడ్జెట్‌లు ప్రవేశపెట్టాను. రోశయ్య 15 సార్లుతో పోల్చితే ఆ తర్వాత నేనే! నా తొలి అసెంబ్లీ బడ్జెట్‌ రూ.40వేలకోట్లు.

వారిద్దరికీ అదే తేడా..

ఎన్టీఆర్‌, చంద్రబాబు ఇద్దరూ సీఎంలుగా పార్టీ సిద్ధాంతాలైన పేదరిక నిర్మూలన, సంక్షేమానికి కట్టుబడి పనిచేశారు. చంద్రబాబు... రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలు వచ్చేలా చేయడం, తద్వారా సంపద సృష్టించి పేదలకు సంక్షేమం అమలు చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినా ఆచరించిన విధానాలు వేర్వేరు!

అందుకే తక్కువగా మాట్లాడతా...

ఎన్ని పదవులు అధిరోహించినా, ఎన్ని బాధ్యతలు నెరవేర్చినా ఒత్తిడికి గురికాను. 1987లో ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో నలుగురు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు నా పదవి పోయింది. కానీ, ఆ రెండేళ్లకే కేబినెట్‌ ర్యాంకుతో పదవి లభించింది. చాలామంది నేను తక్కువగా, పొడిగా మాట్లాడతానని అనుకుంటారు. తక్కువ మాట్లాడి, ఎక్కువగా వింటేనే ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి. స్పీకర్‌గా పనిచేసిన సమయంలో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడేవాడిని. స్పీకర్‌ డజంట్‌ స్పీక్‌.

రాజ్యసభకు వెళ్లాలనేదే ఆశ..

రాష్ట్రస్థాయిలో ఇన్నేళ్లలో ఎన్నో పదవులు అధిరోహించాను. అందుకే ఇకపై రాజ్యసభలో అడుగుపెట్టాలనేదే నా కోరిక. రాజకీయాలు ఇప్పు డు పూర్తిగా ధనమయమైపోయాయి. ముఖ్యం గా జగన్‌ తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించారు. ఆ డబ్బుతో అధికారం సంపాదించి మళ్లీ డబ్బు సంపాదించారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవ డం ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడమే!


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 09:37 AM