Share News

Cyclone Weakens: బలహీనపడిన తీవ్ర అల్పపీడనం

ABN , Publish Date - Apr 10 , 2025 | 05:29 AM

తీవ్ర అల్పపీడనం బలహీనపడింది, మరింత దిశ మార్చుకుంటూ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మఽధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. కోస్తా, రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు, వడగాల్పులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది

Cyclone Weakens: బలహీనపడిన తీవ్ర అల్పపీడనం

  • నేడు కొన్ని చోట్ల వర్షాలు.. మరికొన్ని చోట్ల వడగాడ్పులు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): తీవ్ర అల్పపీడనం బలహీనపడింది. అల్పపీడనంగా మారి నైరుతి బంగాళాఖాతం నుంచి బుధవారం సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలహీనపడుతుందని పేర్కొంది. దాని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో బుధవారం చెదురుమదురు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఓ వైపు ఎండ తీవ్రత, వడగాల్పులు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.


గురువారం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8, ప్రకాశం జిల్లా దరిమడుగులో 40.3, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1, కడప జిల్లా జమ్మలమడుగులో 39.9, అల్లూరి జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు 39.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 05:50 AM