RTC Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:53 PM
విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు.
పార్వతీపురంమన్యం, నవంబర్ 6: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దగ్ధం ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను మరువక ముందే రాష్ట్రంలోని పలు చోట్ల బస్సు ప్రమాదాలు జరిగాయి. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు తాజాగా పార్వీతీపురం మన్యం జిల్లాలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు మంటల్లో కాలిబూడిదైంది.
జిల్లాలోని పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గుర్తించిన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేశాడు. బస్సంతా మంటలు వ్యాపించక ముందే ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ తరువాత మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రయాణికులు వివిధ వాహనాల్లో తాము చేరాల్సిన గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లిపోయారు.
కాగా.. ఆర్టీసీ బస్సు దగ్ధంపై మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంపై ఎస్పీతో మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు: హోంమంత్రి
పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
Read Latest AP News And Telugu News