Share News

Political Decision : రాజ్యసభకు విజయసాయి రాజీనామా

ABN , Publish Date - Jan 26 , 2025 | 03:29 AM

విజయసాయిరెడ్డి శనివారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను అందించారు.

Political Decision : రాజ్యసభకు విజయసాయి రాజీనామా

  • ఆ వెంటనే ఆమోదించిన చైర్మన్‌ ధన్‌ఖడ్‌

  • ఏపీకి వెళ్లగానే వైసీపీకీ రాజీనామా చేస్తా

  • పదవుల ఆశలు, కేసుల మాఫీ హామీలు లేవు

  • నా అశక్తత కారణంగానే రాజీనామా

  • నిర్ణయానికి ముందే జగన్‌తో మాట్లాడాను

  • వద్దు.. కరెక్టు కాదు.. అన్నారు.. ఢిల్లీలో మీడియాకు సాయిరెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని, పదవులు ఆశించి గానీ, కేసులు మాఫీ చేస్తామనే హామీ తీసుకునిగానీ ఆ నిర్ణయం తీసుకోలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ను ఆయన నివాసంలో కలిసి ఎంపీ పదవికి రాజీనామా లేఖను అందించారు. ఆయన రాజీనామాను ధన్‌ఖడ్‌ ఆమోదించినట్టు ఆ వెంటనే రాజ్యసభ సెక్రటేరియెట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇదే విషయం విజయసాయి కూడా ధ్రువీకరించారు. తాను రాజకీయాల్లోకివచ్చినప్పటికి, ఇప్పటికి పరిస్థితులు మారాయనీ, తన అశక్తత వల్ల ఎంపీగా రాష్ట్రానికీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వైసీపీకీ న్యాయం చేయలేననే ఆలోచనతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తిడీ లేదన్నారు. తనకన్నా శక్తిసామర్థ్యాలు అధికంగా ఉన్న వ్యక్తులెవరైనా తన స్థానంలో ఎంపీగా వస్తే రాష్ట్రానికీ, దేశానికీ ఉపయోగపడతారని తెలిపారు. తన రాజీనామాతో కూటమి ప్రభుత్వానికే లబ్ధి కలుగుతుందని, వైసీపీకి కాదన్నారు. సంఖ్యాబలం లేకపోవడంతో ఇంకొకరిని తన స్థానంలో వైసీపీ రాజ్యసభకు పంపలేదని చెప్పారు. తనపై నమోదైన కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, భయపడేతత్వం తన వంట్లో లేదన్నారు. విజయసాయి ఇంకా ఏమన్నారంటే..

’’రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాక లండన్‌లో ఉన్న జగన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడాను. ఆ తర్వాతనే రాజీనామా సమర్పించాను. జగన్‌ రాజీనామా చేయొద్దని, పార్టీ అండగా ఉంటుందని, నిర్ణయం కరెక్టు కాదని అన్నారు. ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు న్యాయం చేయలేనని ఆయనకు చెప్పాను.


ఇక్కడి (ఢిల్లీ) నుంచి వెళ్లాక వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తాను. నాలాంటివారు మరో వెయ్యి మంది వైసీపీని వీడినా జగన్‌కు ఉన్న ప్రజాదరణ తగ్గదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా వైఎస్‌ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నా జీవితకాలంలో వైఎస్‌ కుటుంబంతో విభేదాలు రావు. హిందూ ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని నమ్మినవ్యక్తిగా అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పకుండా రాజకీయాలు చేయడం ఈ రోజుల్లో కష్టంగా ఉంది. నేను రాజీనామా చేస్తే ఆ సీటు కూటమికే వెళ్తుందనే విషయం నాకు తెలుసు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో రాజకీయంగా విభేదించాను. వారిని వ్యక్తిగతంగా ప్రత్యర్థులుగా భావించట్లేదు. రాజకీయాల నుంచి తప్పుకొంటే నేను బలహీనుణ్ణి అవుతాను. మరి.. నాపై కేసులు ఎందుకు మాఫీ చేస్తారు? దైవాన్ని నమ్మేవ్యక్తిని. మోసం, నమ్మకద్రోహం చేయను. నా రాజీనామా వెనుక గవర్నర్‌ పదవి హామీ, బీజేపీ ఎంపీ కావడం, డబ్బులు తీసుకోవడం వంటివేమీ లేవు. విశాఖపట్నాన్ని దోచేశాను అని నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. నాకు బెంగళురులో ఇల్లు, విజయవాడలో ఇల్లు, వైజాగ్‌లో అపార్టుమెంటు ఉన్నాయి. ఇంకేం ఆస్తులు లేవు. నాకు హార్టికల్చర్‌, గెస్ట్‌ లెక్చర్స్‌ ఇష్టం. ఇకనుంచి వాటిమీద దృష్టి పెడతాను’’


ముగిసిన రాజ్యసభ అధ్యాయం

రాజ్యసభ సభ్యునిగా విజయసాయిరెడ్డి సమర్పించిన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం బులెటిన్‌ వెలువడింది. దీంతో దాదాపు ఎనిమిదేళ్ల ఏడు నెలలకు పైగా వైసీపీ తరఫున కొనసాగిన విజయసాయి రెడ్డి రాజ్యసభ అధ్యాయం ముగిసింది. ఢిల్లీలో ఉన్నంత కాలం వివాదాస్పద వ్యక్తిగా నిత్యం వార్తల్లో ఉన్నారు. వెంకయ్యనాయుడు రాజ్యసభ చైర్మన్‌గా ఉండగా, విజయసాయి ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణ చెప్పారు. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రధాని మోదీ నడిచి వెళ్లే దారిలో నిలబడి.. ఆయన పలకరిస్తే ఉప్పొంగిపోయేవారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 26 , 2025 | 03:29 AM