Money Scam : సామాజిక సేవ అంటూ..200 కోట్లు కొట్టేశారు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:13 AM
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీమలు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేశారు.

ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో భారీగా మోసాలు
గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
గుంటూరు, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) కంపెనీ అంటూ నమ్మించారు. అనేక స్కీమలు పెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అమాయక ప్రజల నుంచి సుమారు రూ.200 కోట్లు వసూలు చేశారు. తీరా డబ్బులేవని అడుగుతుంటే అదిగో.. ఇదిగో అంటూ మాయమాటలు చెబుతున్నారు. దీంతో మోసపోయామని గ్రహించిన కొందరు బాధితులు సోమవారం గుంటూరులో ఎస్పీ సతీష్‌కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పెదనందిపాడుకు చెందిన గోవాడ సంధ్య శివపార్వతి, షేక్ హుస్సేన్ వలి గతంలో క్రిప్టో కాయిన్స్ తరహాలో కీబో కాయిన్స్‌లో పనిచేశారు. ఆ సమయంలో వారికి గుంటూరులోని రాజేంద్రనగర్‌కి చెందిన వేజండ్ల శివకుమారి అనే మహిళతో పరిచయమమైంది. థర్డ్ పార్టీ ఫండ్స్ (టీపీఎఫ్) అనే కంపెనీ ఉందని, ఈ కంపెనీ పేదలను ఆదుకునేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు తమ లాభాల్లో 2 వాటాను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎ్‌సఆర్) ఫండ్ కింద ఈ కంపెనీకి కేటాయిస్తాయని శివకుమారి నమ్మబలికింది.
నల్లపాడుకు చెందిన నవీన్‌ను టీపీఎఫ్ కంపెనీకి సౌత్ ఇండియా హెడ్‌గా పరిచయం చేసింది. సీఎ్‌సఆర్ ద్వారా వచ్చే నిధులను పేదలకు ఖర్చు చేయగలరని నమ్మకం కుదరాలంటే ముందుగా రూ.1.2 లక్షలు ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టాలని తెలిపింది. పెట్టుబడి పెడితే రోజుకు రూ.30 వేల చొప్పున మన బ్యాంకు ఖాతాల్లో కంపెనీ జమ చేస్తుందని పేర్కొంది. రూ.15 వేలు మీరు ఉంచుకొని మిగిలిన రూ.15 వేలు కంపెనీకి ఇవ్వాలని చెప్పింది. ఇలా మొదటి 4 నెలల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందని, తర్వాత 8 నెలలు డబ్బు మీ పేరుతో తెరిచే ఎన్జీవో ట్రస్ట్ ఖాతాలో జమ అవుతాయని చెప్పింది. అందులో రూ.2. లక్షలు మీరు ఉంచుకొని రూ.40వేలు పేదలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలని తెలిపింది.
ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి మరీ...
బాధితులు తమ ఆస్తి పత్రాలు తాకట్టుపెట్టి రూ.1.2 లక్షలు సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారు చెప్పినట్లుగానే రోజుకు రూ.30 వేలు చొప్పున కొంతకాలం జమ చేశారు. వారు పెట్టిన పెట్టుబడి మొదటి 4 నెలల్లోనే రావడంతో బాధితులు తమకు తెలిసిన వారందరినీ సభ్యులుగా చేర్చారు. వారి ఖాతాల్లో కూడా ప్రతిరోజు డబ్బులు వేశారు. ఈ క్రమంలో శివకుమారి, కొలగాని నవీన్ బాబు, ఆయన తమ్ముడు వేణు, నవీన్ భార్య సుభాషిణి, వారి బంధువులు గణేష్, మణికంఠ, చిన్న అలియాస్ వెంకటేశ్వర్లు తదితరులు నల్లపాడులో కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడే ఫ్లేవర్స్ ఓషన్ అనే ఐస్‌క్రీమ్ తయారీ కంపెనీని ప్రారంభించి దానికి జిల్లాల వారీగా డిస్ర్టిబ్యూషన్స్ ఇస్తున్నామని, జిల్లా డిస్ర్టిబ్యూటర్ కావాలంటే రూ.25 లక్షలు, మండల డిస్ర్టిబ్యూటర్ కావాలంటే రూ.5 లక్షలు చెల్లించాలని చెప్పారు. టీపీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్ర్టిబ్యూషన్ తీసుకోవాలని షరతు విధించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రూ.25 లక్షలు చెల్లించి పల్నాడు జిల్లా డిస్ర్టిబ్యూషన్ తీసుకున్నానని శివపార్వతి తెలిపారు. వలి కూడా రూ.5 లక్షలు చెల్లించి చిలకలూరిపేట మండల డిస్ర్టిబ్యూషన్ తీసుకున్నారు. ఇలా టీపీఎఫ్ కంపెనీలో అనేక మందిని సభ్యులుగా చేర్చి వారితో నవీన్, శివకుమారిలకు రూ.80 లక్షల వరకు కట్టించామని చెప్పారు. ఈ సంస్థ 2023 మేలో ప్రారంభమైందని మొదట్లో తనకు 9 నెలలు డబ్బులు రాగా మిగిలిన వారికి 2-3 నెలలు వచ్చాయని చెప్పారు. నమ్మకం కలిగాక 3 రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరి రూ.లక్షలు పెట్టుబడిగా పెట్టారన్నారు. అయితే 10 నెలల నుంచి ఎవరికీ డబ్బులు రావడం లేదన్నారు. అదేమంటే ఎన్నికల కోడ్ వచ్చిందని, నిధులు ఆగిపోయాయని మాయ మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ వచ్చారన్నారు.
టీపీఎఫ్ కంపెనీకి రూ.3.3 కోట్లు కట్టించా
టీపీఎఫ్, సీఎ్‌సఆర్ ద్వారా పేదలకు సహాయం చేసే అవకాశం ఉంటుందని నమ్మించి సభ్యులుగా చేర్చుకున్నారని కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన బి క్రాంతి కుమార్ దంపతులు గుంటూరులో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరూ 50 మందిని సభ్యులుగా చేర్పిస్తే.. వారికి నెలకు రూ.8 లక్షలు చొప్పున జీతం ఇస్తామని చెప్పడంతో తాను 50 మందితో సంస్థకు రూ.3.3 కోట్లు కట్టించానని తెలిపారు. నెల క్రితం ఇల్లు వదిలి గుంటూరు వచ్చి నల్లపాడులో ఉంటున్నామని చెప్పారు. నవీన్‌బాబుకు ఫోన్ చేస్తే కాంబోడియాలో ఉన్నానని, తర్వాత దుబాయ్ వెళ్లాలి, అమెరికా వెళ్లాలి, బ్రిటన్ వెళ్లాలంటూ మాయ మాటలతో కాలం గడుపుతున్నాడని అన్నారు. కాకినాడ ప్రాంతంలో తనలాగే మరో 11 మంది వరకు రూ.కోట్లు సంస్థకు కట్టించారన్నారు.
ఆత్మహత్య తప్ప మార్గం లేదు!
టీపీఎఫ్, సీఎ్‌సఆర్ పేర్లతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ కల్పించి ఏపీ తెలంగాణ, ఒడిశాల్లో 200 మందిని సభ్యులుగా చేర్చుకొన్న ఈ సంస్థ రూ.200 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు వాపోయారు. ఈ వ్యవహారంలో వి.శివకుమారి కీలకపాత్ర పోషించారన్నారు నవీన్‌బాబు, షేక్ గౌస్‌తో పాటు వారి కుటుంబసభ్యులు, వారికి సహకరించిన వారందరిపైనా కఠిన చర్యలు తీసుకుని, తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని వారు కన్నీరు పెట్టుకున్నారు.