Minister TG Bharat : ఎవరికి నచ్చినా.. నచ్చకున్నా.. లోకేశ్ కాబోయే సీఎం!
ABN , Publish Date - Jan 21 , 2025 | 03:51 AM
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.

పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి టీజీ భరత్
మందలించిన చంద్రబాబు
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సభ్యుడైన ఆయన.. సోమవారం సాయంత్రం జ్యూరిక్‌లో తెలుగు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ‘డైనమిక్ యంగ్ లీడర్ లోకేశ్ అత్యంత ఉన్నత విద్యావంతుడు. రాష్ట్రంలోని 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, రాజ్యసభ సభ్యుల్లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినవారు ఎవరూ లేరు. ఏపీలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను స్థాపిస్తే.. భవిష్యత్‌లో ఏమవుతుందోనన్న అనుమానాలు పారిశ్రామికవేత్తల్లో చాలామందికి ఉన్నాయి. సొంత చెల్లికి, తల్లికే న్యాయం చేయలేనోడు (మాజీ సీఎం జగన్‌నుద్దేశించి) 5 కోట్ల మంది ప్రజలకు ఏం చేయగలుగుతాడనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రజలు ఓటేసేటప్పుడు కచ్చితంగా ఒక్క నిమిషమైనా ఆలోచిస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను కొన్ని దశాబ్దాలపాటు పరిపాలిస్తుంది. అందుచేత ఎలాంటి సమస్యా ఉండదు’ అని వారికి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు ఆగ్రహం
లోకేశ్ కాబోయే సీఎం అని వ్యాఖ్యానించిన భరత్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమయం, సందర్భం లేకుండా అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని మందలించినట్లు సమాచారం. అంతకు ముందే ఏపీలోని పార్టీ నేతలకు పార్టీ అధిష్ఠానం గట్టి హెచ్చరికలు జారీచేసింది. లోకేశ్‌ను ఉపముఖ్యమంత్రిని చేయాలన్న ప్రకటనలు మానుకోవాలని.. ఆ విషయంపై అసలు మాట్లాడొద్దని ఆదేశాలిచ్చింది. ఇది జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే చంద్రబాబు సమక్షంలోనే కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని భరత్ వ్యాఖ్యానించారు. దీంతో ఆ సమావేశం ముగిశాక ఆయనకు చంద్రబాబు అక్షింతలు వేశారు. ‘మనం ఇక్కడకు వచ్చింది దేనికి? నువ్వు మాట్లాడింది ఏమిటీ? ఏదైనా సమయం, సందర్భం ఉండక్కర్లేదా? మరోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని ఆయన మంత్రిని మందలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని కోరుతూ టీడీపీ నేతలు మూడ్రోజులుగా డిమాండ్ చేస్తుండడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. తక్షణమే దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలని సోమవారం దావోస్ నుంచే పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కార్యాలయ బాధ్యులు ఆయన ఆదేశాలను అధికార ప్రతినిధులు, ముఖ్య నేతలకు ఫోన్‌చేసి తెలియజేశారు. మూడ్రోజుల క్రితం పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. దానిపై చంద్రబాబు స్పందించలేదు. మర్నాటి నుంచి టీడీపీ నేతలు ఆ దిశగా ప్రకటనలు పెంచారు. ఇవి మరీ ఎక్కువ అవుతుండడంతో ముఖ్యమంత్రి వాటిని ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ‘అనవసరమైన అంశాలను మీడియా ముందు ప్రస్తావించవద్దు. అంతర్గత విషయాలను కూటమి పక్షాల అధినేతలు మాట్లాడతారు. మరెవరూ దీనిపై స్పందించవద్దు’ అని కేంద్ర కార్యాలయం సూచించింది.
బాబు బ్రాండ్ అదనపు అడ్వాంటేజ్: భరత్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు వివిధ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నారని, చివరకు ఎక్కడ ఎక్కువ సబ్సిడీలు లభిస్తే ఆ రాష్ట్రానికే వెళ్లిపోతున్నారని పరిశ్రమల మంత్రి భరత్ తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీలో వివరించారు. ఏపీలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాలతోపాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తోందని చెప్పారు. పైగా చంద్రబాబు బ్రాండ్ తమ రాష్ట్రానికి అదనపు అడ్వాంటేజ్‌గా పేర్కొన్నారు. అందుకే 7 నెలల్లోనే రాష్ట్రంలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్, రిలయన్స్, ఎన్‌టీపీసీ, మిట్టల్ స్టీల్స్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. స్విట్జర్లాండ్ నుంచి కూడా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.