Share News

Mayor Elections: 2 మేయర్‌ పీఠాలు టీడీపీ కైవసం

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:04 AM

టీడీపీ విశాఖ మరియు గుంటూరు నగరాల్లో మేయర్‌ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే కుప్పం, తుని, మరియు పాలకొండ మున్సిపాలిటీలలో కూడా టీడీపీ నాయకులు కీలక పదవులను గెలిచారు. టీడీపీ మరియు కూటమి అభ్యర్థులు మేయర్‌, చైర్‌పర్సన్‌ స్థానాలకు ఎన్నికయ్యారు.

Mayor Elections: 2 మేయర్‌ పీఠాలు టీడీపీ కైవసం

  • విశాఖలో పీలా, గుంటూరుకు కోవెలమూడి

  • కుప్పం, తుని, పాలకొండ చైర్‌పర్సన్‌ స్థానాలూ టీడీపీ ఖాతాలోకే

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రెండు ప్రధాన నగరాలు, రెండు పట్టణాలు, ఒక నగర పంచాయతీలో టీడీపీ కూటమి పాగావేసింది. విశాఖ, గుంటూరు నగరాల మేయర్‌ స్థానాలను.. కుప్పం, తుని మున్సిపల్‌, పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ పదవులను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ మేయర్‌గా ఉన్న గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవి నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నికకు సోమవారం కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. కూటమి అభ్యర్థిగా పీలా పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ ప్రతిపాదించగా.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు బలపరిచారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో పీలా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేసి మేయర్‌గా ప్రమాణం చేయించారు. బాధ్యతలు స్వీకరించిన పీలాను కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతోపాటు అధికారులు, కూటమి నేతలు అభినందించారు. విశాఖ కార్పొరేషన్‌లో 98 స్థానాలుండగా.. గత ఏడాది వరకు వైసీపీకి 59, టీడీపీకి 28, జనసేన 3, బీజేపీ, సీపీఎం, సీపీఐలకు తలొకటి.. నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు ఉండేవారు.


కూటమి ప్రభుత్వం వచ్చాక పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. ప్రస్తుతం టీడీపీకి 48, జనసేనకు 14, బీజేపీకి ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 1987లో మొదటిసారి టీడీపీ నుంచి డీవీ సుబ్బారావు మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి ఎన్నికైనది పీలా శ్రీనివాసరావే కావడం విశేషం. ఇక గుంటూరు కార్పొరేషన్‌ మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర(నాని) ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికలో కూటమి తరఫున కోవెలమూడి, వైసీపీ అభ్యర్థిగా అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. 2021 కార్పొరేషన్‌ ఎన్నికల్లో 57 స్థానాలకు గాను వైసీపీకి 47, టీడీపీకి 8, జనసేనకు 2 వచ్చాయి. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నుంచి 16 మంది కార్పొరేటర్లు టీడీపీలో, మరో నలుగురు జనసేనలో చేరారు. దీంతో కూటమి బలం 30కి చేరింది. ఎంపీ-కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు, ఒక టీడీపీ ఎమ్మెల్సీ సహా 61 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. కోవెలమూడికి 34, వైసీపీకి 27 ఓట్లు వచ్చాయి. కోవెలమూడి 7 ఓట్ల మెజారిటీ గెలుపొందినట్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవతేజ ప్రకటించారు. ఈ మేరకు డిక్లరేషన్‌ ఫామ్‌ను అందజేశారు. నాని పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎమ్మెల్యేలు మాధవి, నసీర్‌ అహ్మద్‌, రామాంజనేయులు తదితరుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జీఎంసీ నుంచి ప్రత్యేక వాహనంపై భారీ ర్యాలీ నిర్వహించారు.


  • సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ నాలుగేళ్ల తర్వాత టీడీపీ వశమైంది. ఈ ఎన్నికల్లో 24 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థి, వైస్‌చైర్మన్‌-2 ఎస్‌డీ హఫీజ్‌కు 9 ఓట్లు, టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్‌కు 15 ఓట్లు లభించాయి.

  • కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి నార్ల భువనసుందరి, వైస్‌ చైర్మన్‌గా ఆచంట రమేశ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలింది. జగన్‌ ఇటీవల పాలకొండ వచ్చి నగర పంచాయతీ కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌ పదవి చేజారకుండా చూసుకోవాలని చెప్పినా ఫలితం లేకపోయింది. టీడీపీ అభ్యర్థి ఆకుల మల్లీశ్వరి చైర్‌పర్సన్‌ పదవికి నామినేషన్‌ వేశారు. ఇప్పటికి రెండు సార్లు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. సోమవారంనాటి ఎన్నికల్లో మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Updated Date - Apr 29 , 2025 | 04:11 AM