Sachin Tendulkar: అది నాకు గోల్డెన్ మూమెంట్: సచిన్
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:33 PM
పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పాల్గొని మాట్లాడారు. బాబా పంపిన ఓ పుస్తకం.. ఆయన ఆశీస్సుల వల్లే 2011 ప్రపంచ కప్ గెలిచామని గుర్తు చేసుకున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, నవంబర్ 19: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) హాజరై మాట్లాడారు. సత్యసాయి బాబాతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సత్యసాయి తనకి ఓ పుస్తకం పంపారని.. అదే జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని చెప్పుకొచ్చారు.
‘ప్రజలను జడ్జ్ చేయొద్దు.. వారిని అర్థం చేసుకోవాలి అని సత్యాసాయి నాకు చెప్పారు. దీని వల్ల చాలా సమస్యలు మన దరికి రావని సూచించారు. 2011 ప్రపంచ కప్‌లో నేను ఆడుతున్నప్పుడు నా మది నిండా ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. ఎందుకంటే అదే నా చివరి వరల్డ్ కప్. అప్పుడు నేను బెంగళూరులో ఉన్నా. ఆ సమయంలో బాబా పంపిన ఓ పుస్తకం నా దగ్గరికి వచ్చింది. ఆ వెంటనే నా ముఖంలో తెలియని ఆనందం. నా జీవితంలో అదే నాకు గోల్డెన్ మూమెంట్ అనిపించింది’ అని సచిన్ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.
అదే నాకు ధైర్యాన్నిచ్చింది..
‘బాబా పంపిన పుస్తకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ప్రాక్టీస్ నుంచి మ్యాచ్‌లు ఆడే వరకు.. ఆ పుస్తకమే నా తోడుంది. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ముంబైలో శ్రీలంకపై ఘన విజయం సాధించాం. సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడాం. దేశమంతా ఆనందంలో మునిగిపోయింది. నా ఇన్నేళ్ల క్రికెట్ కెరీర్‌లో అదే గొప్పగా అనిపించింది. దీనికి కారణం బాబా ఆశీస్సులు, గురువుల దీవెనలే. భగవాన్ సత్యసాయి బాబా అనుగ్రహమే దీనికి ముఖ్య కారణం’ అని సచిన్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి