MLA Paritala Sunitha: నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే సునీత.. ‘తోపు’వి కోతలే తప్ప.. చేతలుండవు
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:52 PM
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్నే లేపాయి.
- రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
- తోపుదుర్తిలో సబ్‌స్టేషన్, సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే
అనంతపురం: తాను తోపునని చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డివి మాటల్లో కోతలు తప్పా... చేతల్లో అభివృద్ధి ఎక్కడా చూపించలేని దద్దమ్మ అని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత(Raptadu MLA Paritala Sunitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్, సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తోపుదుర్తి గ్రామంలో విద్యుత్ సబ్‌స్టేషన్ లేక గత కొన్ని సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ రెండు చెరువులు నిండాయని తెలిపారు.
పంటలు సాగు చేయాలంటే విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవని గుర్తు చేశారు. ఈ సమస్యలు అధిగమించేందుకు విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించామన్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఓ దద్దమ్మ వీటిని పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రకాష్ రెడ్డి ఎక్కడ చూసినా కమీషన్ల కక్కుర్తితో టీడీపీ హయాంలో ప్రారంభించిన ఏ ఒక్క పనిని ముందుకు సాగనివ్వలేదన్నారు. ఆయన సొంత గ్రామంలో కనీసం విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించుకోలేని అసమర్థుడు.. ఆ సైకో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.

విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం ఆగిపోయి పూర్తిగా రద్దు చేస్తారన్న క్రమంలో తాను చొరవ తీసుకొని కాంట్రాక్టర్‌తో మాట్లాడి పాత ధరలకే నిర్మాణం చేపట్టామన్నారు. నిర్ణీత కాలంలోనే పూర్తి చేశామని, ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమైందన్నారు. ఈ సబ్ స్టేషన్‌తో తోపుదుర్తి, వేపచెర్ల, పాలచెర్ల గ్రామాల్లోని సుమారు రెండు వేల మంది ప్రజలు, రైతులకు ఉపయోగం ఉంటుందన్నారు. ఎన్నికల ముందు మాత్రమే తాను రాజకీయాల గురించి మాట్లాడతానని, ఇప్పుడు ఓట్లు వేసినా, వేయకపోయినా అందరూ తన వారే అన్నారు.

గతంలో ఇక్కడున్న తోపు ఏదో చేస్తారన్న ఉద్దేశంతో గెలిపిస్తే కనీసం సొంత గ్రామానికి రోడ్డు వేయుంచలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇళ్ల నిర్మాణాల పేరుతో రూ.80 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేక అనంతపురం, తగరకుంట రోడ్డులో వెళ్లే చాలామంది ఐదేళ్లపాటు నరకం చూశారన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో గతంలో పార్టీని చూశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. గ్రామంలో మారెమ్మ ఆలయ నిర్మాణంతో పాటు పలు పనుల గురించి తన దృష్టికి తీసుకొచ్చారని... త్వరలోనే చేపడతామని ఎమ్మెల్యే.. గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News