Share News

Pollution Control Board : ‘క్రెబ్స్‌’కు తాళం!

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:40 AM

యూనిట్‌కు తరలించాల్సిన వ్యర్థాలను అందుకు విరుద్ధంగా జనావాసాల మధ్య పారబోసిన కంపెనీకి కాలుష్య నియంత్రణ మండలి షాక్‌ ఇచ్చింది.

Pollution Control Board : ‘క్రెబ్స్‌’కు తాళం!

  • బయోటెక్‌ కంపెనీని మూసివేయాలని పీసీబీ ఆదేశం

విజయవాడ/విశాఖపట్నం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు తరలించాల్సిన వ్యర్థాలను అందుకు విరుద్ధంగా జనావాసాల మధ్య పారబోసిన కంపెనీకి కాలుష్య నియంత్రణ మండలి షాక్‌ ఇచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి వ్యర్థాలను ట్యాంకర్‌లో తరలించి విజయవాడ రూరల్‌ మండలం జక్కంపూడి శివారు ఖాళీ స్థలాల్లో పారబోయడాన్ని పీసీబీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యర్థాలను బయటకు పంపిన క్రెబ్స్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి తాళం వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం కొత్తపల్లిలో క్రెబ్స్‌ ఫార్మా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మందుల తయారీలో వచ్చిన వ్యర్థాలను ఏరోజుకారోజు ఏపీ ఎన్విరాన్‌మెంటల్‌ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసి అనుమతి తీసుకున్న తర్వాత ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్‌(పీపీయూ)కు పంపాలి. కొద్ది రోజుల క్రితం ఎలాంటి అనుమతి తీసుకోకుండా వ్యర్థాలను ట్యాంకర్‌లో విజయవాడకు పంపారు. బిహార్‌కు చెందిన డ్రైవర్‌ ఈ ట్యాంకర్‌ను జక్కంపూడిలోని ఖాళీ స్థలాల్లోకి తీసుకువచ్చి వ్యర్థాలు పారబోస్తుండగా స్థానికులు పట్టుకుని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. ఎన్టీఆర్‌ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగి వ్యర్థాల మూలాలను బయటకు తీసే పనిలో పడ్డారు. డ్రైవర్‌ వద్ద లభించిన కాగితాల ప్రకారం ఈ వ్యర్థాలు జగ్గయ్యపేటలోని ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు వెళ్తున్నట్టుగా చేతితో రాశారు. వాస్తవానికి ఇలా ప్రీప్రాసెసింగ్‌ యూనిట్‌కు పంపే వ్యర్థాలకు డిజిటల్‌ అనుమతి మాత్రమే ఉంటుంది.


పీసీబీ అధికారులు ఈ సమాచారాన్ని విశాఖ జిల్లా పీసీబీ అధికారులకు ఇవ్వడంతోపాటు జగ్గయ్యపేటలోని ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను పరిశీలించారు. తమకు క్రెబ్స్‌ బయోటెక్‌ నుంచి వ్యర్థాలు వస్తున్నట్టు ఎలాంటి సమాచారమూ రాలేదని పీపీయూ సిబ్బంది చెప్పారు. విశాఖ జిల్లా పీసీబీ అధికారులు క్రెబ్స్‌ కంపెనీలో తనిఖీలు చేయగా ఈ ట్యాంకర్‌ నెంబర్‌తో వ్యర్థాలు బయటికి వచ్చినట్టు లాగ్‌ పుస్తకాల్లో గుర్తించారు. ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులకు తెలియజేశారు. నివేదికలను పరిశీలించిన ఉన్నతాధికారులు క్రెబ్స్‌ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News

Updated Date - Feb 10 , 2025 | 05:40 AM