Online Gaming Addiction: ఆన్‌లైన్ గేమ్స్‌కు యువకుడి బలి
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:05 AM
శ్రీసత్యసాయి జిల్లాలో జయచంద్ర అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా అప్పుల్లో కూరుకొని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. చొక్కాపై "ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు" అంటూ లేఖ రాసి గేమింగ్‌కు వ్యతిరేకంగా సందేశం ఇచ్చాడు

ప్లీజ్.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దంటూ చొక్కాపై లేఖ
ఆపై రైలుచక్రాల కింద తల పెట్టిన వైనం
వేరుపడిన తల, మొండెం
శ్రీసత్యసాయిలో ఘటన
హిందూపురం, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ‘ప్లీజ్.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దు. విద్యార్థులూ.. ప్లీజ్ ఆన్‌లైన్ గేమ్ యాప్స్‌ను క్లోజ్ చేయండి’ అని చొక్కాపై రాసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలివీ.. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన జయచంద్ర (23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. తండ్రితో కలిసి రెండేళ్లుగా గ్రామంలో ఓ ప్రైవేటు డెయిరీ నడుపుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై సంపాదించిన సొమ్ము పోగొట్టుకున్నాడు. పాలరైతులకు రూ.3 లక్షలు బకాయి పడ్డాడు. దీనికి తోడు మరికొంత మంది వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేయడంతో ఒత్తిడి పెరిగింది. చేసేది లేక నెల క్రితం పాలవ్యాపారం ఆపేశాడు. ఉద్యోగం కోసం బెంగళూరు వెళతానని చెప్పి శనివారం పైడేటి గ్రామం నుంచి బయల్దేరాడు. రాత్రి తండ్రికి జయచంద్ర ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో త ల్లిదండ్రులు కంగారుపడ్డారు.‘అప్పులన్నీ తీరుస్తామని, ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడవద్ద’ని వేడుకున్నారు. ఆ తర్వాత జయచంద్ర ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు.
రాత్రి హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తల, మొండెం వేరు పడ్డాయి. లోకో పైలెట్ ఇచ్చిన సమాచారంతో హిందూపురం రైల్వే ఎస్‌ఐ సజ్జప్ప, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. లేఖను స్వాధీనం చేసుకున్నారు. జయచంద్ర చొక్కాపై పైడేటి గ్రామమని రాసి ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి కుమారుడి మృతదేహాన్ని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు.