CM Chandrababu: వడివడిగా అభివృద్ధి అడుగులు
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:49 AM
రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో పూర్తి మౌలిక వసతులతో ఎంఎస్‌ఎంఈ పార్కులు సిద్ధమయ్యాయి. మే 1న సీఎం చంద్రబాబు ప్రారంభించనుండగా, మరో 40 పార్కులకు శంకుస్థాపన జరగనుంది.

10 నియోజకవర్గాల్లో సిద్ధమైన ఎంఎస్ఎంఈ పార్కులు
రేపు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రారంభించనున్న సీఎం
మరో 40 పార్కులకు శంకుస్థాపన
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నియోజకవర్గానికొక పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడం, ఇంటికో పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి భారీ పరిశ్రమలను ఆకర్షిస్తూ రూ. వేల కోట్ల పెట్టుబడులతో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కులను అభివృద్ధి చేసి.. వాటిలో సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పుతామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం వేగంగా నెరవేరుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఈ పారిశ్రామిక పార్కులను మే 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మరో 40 నియోజకవర్గాల్లో ఎంఎ్‌సఎంఈ పార్కుల అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. ఆయా పార్కులలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేవారికి సరసమైన ధరలకే భూ కేటాయింపులు చేయడంతోపాటు అన్నివిధాలుగా ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.
ఎంఎస్ఎంఈలకు రూ. 1.28 లక్షల కోట్ల రుణపరపతి
ఏపీఐఐసీ ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కనిష్టంగా 15 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు భూములను సేకరించి పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఆయా పార్కులలో ఏటా 2వేలకు పైగా కొత్త యూనిట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనిట్లకు 10,586 కోట్లు ప్రోత్సాహకాలుగా అందించేందుకు అంచనాలు సిద్ధం చేసింది. ఎంఎ్‌సఎంఈ పార్కుల ద్వారా రూ. 4లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం కొత్త పారిశ్రామికవేత్తలు వేగంగా యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు బ్యాంకుల ద్వారా ఉదారంగా రుణాలు మంజూరు చేయడానికి చర్యలు చేపట్టింది. మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై చర్చించారు. 2025-26లో ఎంఎ్‌సఎంఈలకు రూ.1.28 లక్షల కోట్ల రుణపరపతి కల్పించేలా బ్యాంకర్లను ఒ ప్పించారు. గతంలో 87వేలకోట్లు మాత్రమే రుణపరపతి కల్పించగా.. ఈ ఏడాది సీఎం చొరవతో 48 శాతం ఎక్కువ రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు వచ్చారు.