Minister Savitha: కూటమిలో బీసీలకు పెద్దపీట..
ABN , Publish Date - Nov 08 , 2025 | 01:38 PM
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
- కనకదాసు జయంతికి శాశ్వత జీవో
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అనంతపురం/కళ్యాణదుర్గం: కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savitha) అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని అన్నారు.
కురుబలకు అన్ని రంగాల్లోను అవకాశం కల్పించింది టీడీపీ ప్రభుత్వంలోనే అని, గతంలో తన తండ్రి ఎస్ రామచంద్రరెడ్డికి మంత్రిగా, ఎంపీగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. బీకే పార్థసారథికి ఎంపీగా, ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, తనకు చైర్ పర్సన్‌గా అవకాశం కల్పించారని అన్నారు. గత ఎన్నికల్లో ఇద్దరు కురబ నేతలకు ఎంపీలుగా, తనకు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చారని, గెలిచాక మంత్రిగా కూడా తనకు అవకాశం కల్పించింది టీడీపీనే అని అన్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేయించడం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా కనకదాసు విగ్రహావిష్కరణ శుక్రవారం జరుగుతుందని తెలిపారు. త్వరలో అన్ని కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని, ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) లక్ష్యమని అన్నారు. ఆదరణ-3 పథకం కింద కులవృత్తుల ప్రోత్సహిస్తామని తెలిపారు.
కురుబ కులస్థులు చిరకాలంగా ఎదురుచూస్తున్న భక్త కనకదాసు జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడానికి శాశ్వత జీవోను కూడా శుక్రవారం విడుదల చేశామని మంత్రి తెలిపారు. శాశ్వత జీవో తెస్తామని యువగళం పాదయత్రలో నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరిందని అన్నారు. శాశ్వత జీవో ఇచ్చినందుకు మంత్రి నారా లోకేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కురుబ కులస్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా గుడికట్ల పూజారుల గౌరవ వేతనం, ధూప దీప నైవేద్యాలకు నెలకు రూ.7 వేలు అందజేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సత్యనారాయణ, ఆ శాఖ జిల్లా అధికారి కుష్భూ కొఠారి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్
Read Latest Telangana News and National News