Share News

Massive ACB Raids: మెరుపుదాడుల వెనుక మర్మం

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:35 AM

రిజిస్ట్రేషన్‌ శాఖలో అసలేం జరుగుతోంది?...ఒకటో, రెండో కాదు...ఏకంగా 12 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులపై ఏకకాలంలో ఏసీబీ మెరుపుదాడులు చేయడంతో... ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో...

Massive ACB Raids: మెరుపుదాడుల వెనుక మర్మం

  • కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో లంచంచిన్నమాట... అంతకుమించిన అక్రమాలు

  • సస్పెన్షన్‌ వేటు పడకుండా భారీగా బేరాలు

  • కోటి సమర్పించుకున్న ఓ సబ్‌ రిజిస్ట్రార్‌

  • భారీ సెటిల్‌మెంట్‌ చేసిన ఓ ఉన్నతాధికారి

  • సర్కార్‌ సీరియస్‌.. ఏసీబీతో సోదాలు

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రిజిస్ట్రేషన్‌ శాఖలో అసలేం జరుగుతోంది?...ఒకటో, రెండో కాదు...ఏకంగా 12 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులపై ఏకకాలంలో ఏసీబీ మెరుపుదాడులు చేయడంతో... ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఇదే ప్రధాన చర్చగా మారింది. రిజిస్ట్రేషన్లలో ప్రతి డాక్యుమెంట్‌కూ ఇంత మొత్తం అని ధరను నిర్ణయించి వసూలు చేస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన లంచాల వ్యవహారమే. అరికట్టలేని, పూర్తిస్థాయిలో నిర్మూలించలేని జాడ్యంగా ఇది చాపకింద నీరులా సాగిపోతోంది. కానీ, అంతకు మించిన అవినీతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతుందన్న సంకేతాలు ప్రభుత్వానికి అందాయి. కొందరు అధికారుల విశృంఖల అవినీతి వ్యవహారాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో బుధవారం భారీ ఎత్తున సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ విరుచుకుపడింది. నిజానికి ఏసీబీ విభాగం ముఖ్యమంత్రి నియంత్రణలో ఉంది. సీఎం ఆదేశాలతోనే ఈ ఆకస్మిక దాడులు జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంతలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేమై ఉంటుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అదో హాట్‌ సీటు...

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఓ ఉన్నతస్థాయి అధికారి తీరుపై ఇటీవల తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. వాటిని ప్రభుత్వం పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. అయితే, రాయలసీమలో ప్రముఖ పుణ్యక్షేత్ర జిల్లా పరిధిలోని ఓ సబ్‌రిజిస్ట్రార్‌ వ్యవహారంలో అమరావతి స్థాయిలో ఈయన పెద్ద పంచాయతీ నడిపి, భారీ డీల్‌ను సెటిల్‌ చేసినట్లుగా తెలిసింది. నిజానికి ఆ సబ్‌రిజిస్ట్రార్‌పై లేని ఆరోపణ, విమర్శలంటూ లేవు. సస్పెన్షన్‌ ఆ అధికారికి కొత్తకాదు. బదిలీ కూడా కొత్త కాదు. కానీ, ప్రభుత్వంలో ఎవరు ఉన్నా, అధికారం ఎవరిదయినా సరే... ఆయన ఆ కార్యాలయంలోనే పనిచేస్తుంటారు. అలా పనిచేయాలన్నదే ఆయన లక్ష్యం. ఇందుకు ఆయన ఎంతయినా ఖర్చు పెడుతుంటారు. ఎంతకయినా తెగిస్తారు. ఈ విషయంలో చివరకు చిరుద్యోగులతో కూడా భౌతిక ఘర్షణలకు దిగే మనస్తత్వం ఆయనది. ఇటీవలి కాలంలో వాటాల పంపకంలో తేడాలొచ్చాయని ఓ చిరుద్యోగితో ఆయన ఘర్షణపడ్డారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా, దానిపై విచారణ చేయించింది. సబ్‌ రిజిస్ట్రార్‌తోపాటు, చిరుద్యోగిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విచారణాధికారి... ప్రభుత్వానికి సిఫారసు చేశారు.


ఈ నేపధ్యంలో ఆ ఇద్దరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసిప్లినరీ కేసులను వాడుకుని సొమ్ములు పిండుకోవడానికి అలవాటు పడ్డ ఆ ఉన్నతాధికారి సెటిల్‌మెంట్‌కు దిగారు. సస్పెన్షన్‌కు గురికావాల్సిన సబ్‌రిజిస్ట్రార్‌ను పిలిచి బేరం మాట్లాడుకున్నారని తెలిసింది. తొలుత రెండు కోట్లకు అనుకున్నది రూ.1.5కోట్లకు..చివరకు రూ.కోటికి సెటిల్‌ అయినట్లు, చెల్లింపులూ జరిపినట్టు తెలిసింది. దీంతో ఆ అధికారిపై క్రమశిక్షణా చర్యలను అటకెక్కించారు. ఆ సబ్‌రిజిస్ట్రార్‌తో గొడవపడ్డ చిరుద్యోగిపై సస్పెండ్‌కు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి ప్రభుత్వ పెద్దలకు చేరింది. నిఘా విభాగాన్ని రంగంలోకి దింపి ఆ అధికారి జాతకాన్ని తెప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇలాంటి సెటిల్‌మెంట్‌ పనులకు క్యూలో ఉన్న మరికొందరి చిట్టా బయటపడింది. విషయం సీరియ్‌సగా ఉండటంతో ప్రభుత్వం ఏసీబీని రంగంలోకి దింపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, రిజిస్ట్రేషన్‌ శాఖలోని ఓ ఉన్నతాధికారి ఇటీవలికాలంలో 16 జిల్లాల్లోని 34 ఆఫీసులకు భారీటార్గెట్‌లు పెట్టినట్లుగా ఫిర్యాదులొచ్చాయి. బుధవారం ఏసీబీ తనిఖీలు జరిగిన ఆఫీసులు కొన్ని ఇందులో ఉన్నాయి.

చర్యలు తప్పవు: అనగాని సత్యప్రసాద్‌

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలపై రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ స్పందించారు. తప్పుచేసిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. ‘‘అధికారులు తప్పులు చేస్తున్నారని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై మేం అనేక చర్యలు తీసుకున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అందుకే ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది పారదర్శకమైన మా పనితీరుకు నిదర్శనం. ఎక్కడైనా తప్పు జరుగుతుందంటే వెంటనే విచారణ చేయించి చర్యలు తీసుకుంటున్నాం. అవినీతి అధికారులను ఉపేక్షించం’’ అని మంత్రి స్పష్టంచేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంటుందని తెలిపారు.

Updated Date - Nov 06 , 2025 | 06:18 AM