Al Ummah Terrorists: భారీ ఉగ్ర కుట్ర భగ్నం
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:46 AM
దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్ ఉమ్మా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు...

వారిద్దరూ ‘అల్ ఉమ్మా’ ఉగ్రవాదులు
వారి ఇళ్లలో పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు, ఉగ్ర సాహిత్యం స్వాధీనం
ఉగ్రవాదుల భార్యలకు 14 రోజుల రిమాండ్
పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు
మీడియాతో కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్
రాయచోటి, జూలై 3(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బాంబు పేలుళ్లకు అల్ ఉమ్మా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశామని కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో స్థానిక పోలీసులు ఉగ్రవాదుల కదలికలపై విచారణ చేపట్టారు. ఆ వివరాలను డీఐజీ గురువారం మీడియాకు వివరించారు. ‘‘తమిళనాడుకు చెందిన అబూబక్కర్ సిద్దిక్ అలియాస్ అమానుల్లా, మొహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్‌లు అల్ ఉమ్మా ఉగ్రవాదులు. ఆ సంస్థలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు.
1995 నుంచి 2011 వరకు చెన్నై, కర్ణాటక, కేరళల్లో జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో వీరు ప్రధాన నిందితులు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ రథయాత్ర సందర్భంగా మదురైలో జరిగిన బాంబు పేలుడు, ఎగ్మూర్‌లో పేలుడు వంటి అనేక ముఖ్యమైన కేసుల్లో వీరు నిందితులు. 2011లో మంగళూరు బాంబు పేలుళ్ల కేసులో అబూబక్కర్ సిద్దిక్ ప్రధాన నిందితుడు కాగా, మొహమ్మద్ అలీ కూడా నిందితుడు. పోలీసుల కళ్లు కప్పి 30ఏళ్లుగా రాయచోటిలో మారుపేర్లతో జీవిస్తున్నారు. అబూబక్కర్ సిద్దిక్ కొత్తపల్లెలో చిల్లర దుకాణం, మహబూబ్‌బాషా వీధిలో మొహమ్మద్ అలీ చిల్లర దుకాణం, చీరల వ్యాపారం చేస్తున్నారు. రాయచోటి ప్రాంతంలోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరిద్దరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. ఇద్దరూ అల్ ఉమ్మా ఉగ్రవాద సంస్థకు చెందినవారని అధారాలు లభించాయి. అబూబక్కర్ బాంబుల తయారీలో నిపుణుడు.
అతడి ఇంట్లో లభించిన పదార్థాలతో పేలుడు పరికరాలు (ఐఈడీఎస్) తయారు చేయవచ్చు. ఈ సోదాలలో ఫ్యూయల్ ఆయిల్‌తో కలిపిన అమ్మోనియం నైట్రేట్- ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్, స్లర్రీ ఎక్స్‌ప్లోజివ్- (నైట్రోగ్లిజరిన్/ టీఎన్‌టీ), పీఈటీఎన్‌తో నిండి ఉండే బాంబు-20 కేజీల సూట్‌కేసులో, మరొక సూట్‌కేసు-ఐఈడీ, ఒక బాక్స్-ఐఈడీ, గన్ పౌడర్లు, డాగర్, కొడవళ్లు, టైమర్ల కోసం గడియార యంత్రాలు, పుల్ స్విచ్‌లు, ప్రెషర్ స్విచ్‌లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు, పేలుళ్ల సమయంలో గాయాలయ్యేందుకు ఉపయోగించే బాల్ బేరింగ్స్, నట్స్- బోల్డులు, బైనాక్యులర్లు, వాకీటాకీలు, రేడియో పరికరాలు, మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టా్‌పలు, ‘సీ’ కోడింగ్ పుస్తకాలు, చెక్కు పుస్తకాలు, అబూబకర్ సిద్దిక్ తమిళంలో రాసిన రెండు డైరీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతోపాటు వీరిద్దరి ఆర్థిక లావాదేవీల సమాచారం, డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, భారతదేశంలోని పలు ప్రధాన నగరాల మ్యాప్‌లు, టైమింగ్ సర్క్యూట్ల మాన్యువల్స్, ఆస్తి, ప్రయాణ పత్రాలు, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్లు, ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు’ అని డీఐజీ వివరించారు. కాగా, ఇళ్ల సోదాల సందర్భంగా అబూబక్కర్ సిద్దికి భార్య సైరాబాను, మొహమ్మద్ అలీ భార్య షేక్ షమీమ్ పోలీసులపై తిరగబడ్డారు. మహిళా పోలీసులపైకి దాడికి యత్నించారు. సోదాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.