Mahashivaratri Celebrations: శంభో శివ శంభో!
ABN , Publish Date - Feb 27 , 2025 | 03:23 AM
తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.

శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట
శ్రీశైలంలో కనుల పండువగా మల్లన్న కల్యాణం
అంగరంగ వైభవంగా పాగాలంకరణ, ప్రభోత్సవం
త్రికోటేశ్వర స్వామికి లింగోద్భవ అభిషేకాలు
నిత్యాభిషేకమూర్తిగా వాయులింగేశ్వరుడి దర్శనం
ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహావిష్కరణ
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైల మల్లన్న, భ్రమరాంబికా దేవికి సాయంత్రం ప్రభోత్సవం, నంది వాహనసేవ అనంతరం అరగంట పాటు జగద్గురు పీఠాధిపతులతో గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఆ తర్వాత లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పృథ్వీ వెంకటేశ్వర్లు తనయుడు సుబ్బారావు పాగాలంకరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెచ్చిన పాగాలను సైతం స్వామికి ప్రత్యేకంగా ఆలంకరించారు. అనంతరం జ్యోతిర్లింగ మల్లికార్జునుడికి లింగోద్భవ కార్యక్రమంతో పాటు కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
కోటప్పకొండలో ప్రభల పండుగ
పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసింది. లక్షలాది మంది భక్తులు కోటయ్య స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామికి అభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక అలంకారం చేశారు. అర్ధరాత్రి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరిగాయి. ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వామికి పట్టు వస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. ప్రభల పండుగగా పేరొందిన కోటయ్య తిరునాళ్లలో 20 భారీ విద్యుత్ ప్రభలు కొలువు తీరాయి.
రాష్ట్ర పండుగగా మహాశివరాత్రి: మంత్రి ఆనం
రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం నెల్లూరులోని మూలాపేటలో ఉన్న మూలస్థానేశ్వరుడిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆనం విలేకరులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండలో రాష్ట్ర పండువగా మహాశివరాత్రి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 33 సుప్రసిద్ధ క్షేత్రాల్లో ప్రత్యేక అధికారులు పర్యవేక్షణలో వేడుకలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం పాదగయతో పాటు పంచారామ క్షేత్రాలైన సామర్లకోట, ద్రాక్షారామ భీమేశ్వరాలయాలు, కోటిపల్లి సహా ఇతర శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. రాజమహేంద్రవరం గోదావరి నదిలో 2లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పాదగయ పుష్కరిణిలో స్నానాలకు, కుక్కుటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్వారపూడిలో 60 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించారు. విగ్రహం లోపల భాగంలో వెనక శివలింగాన్ని ప్రతిష్టించారు. ఆలయంలో అయోధ్య బాలరాముడు, వారాహి మాత విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ముక్కంటి క్షేత్రంలో..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం వేకువజామున 4 నుంచి రాత్రి10 గంటల వరకు కిటకిటలాడింది. స్వయంభువుగా వెలసిన వాయులింగేశ్వర స్వామి నిత్యాభిషేకమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు ఇంద్ర విమానం, ఆయన దేవేరి జ్ఞానప్రసూనాంబదేవి చప్పరం అధిరోహించి పురవిహారం చేశారు. మూషిక వాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప ముందు సాగగా ఆదిదంపతులను దర్శించుకోవడానికి తరలివచ్చిన భక్తజనంతో మాడవీధులు నిండిపోయాయి. రాత్రి స్వామివారు నంది వాహనం, అమ్మవారు సింహ వాహనంపై విహరించారు.
శ్రీముఖలింగంలో...
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే వంశధార నదిలో స్నానాలు ఆచరించి దర్శనాల కోసం దర్శించుకోవడానికి బారులు తీరారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా, ఒడిశా-ఆంధ్రా సరిహద్దులోని మహేంద్రగిరులపై పాండవులు ప్రతిష్ఠించినట్లు చెబుతున్న శివలింగాలను ఒడిశా, ఆంధ్రా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి భక్తులు భక్తులు దర్శించుకుని, పూజలు చేశారు.
సాగర తీరాన మహా కుంభాభిషేకం
విశాఖపట్నంలో సాగర తీరాన ప్రయాగ్‌రాజ్ నుంచి తెప్పించిన పవిత్ర జలాలతో కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి మహా కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులకు కూడా స్వయంగా అభిషేకం చేసే అవకాశం కల్పించారు. బీచ్‌లో కోటి లింగాలతో మహా శివలింగం ఏర్పాటుచేశారు. సినీనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సహస్రావధాని మాడుగుల నాగఫణిశర్మను ‘అవధాన బ్రహ్మ‘ బిరుదుతో సత్కరించారు.