AP News: కిడ్నీ మార్పిడి.. @ మదనపల్లె టు బెంగళూరు
ABN , Publish Date - Nov 13 , 2025 | 09:03 AM
మదనపల్లెలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
- కార్పొరేట్ ఆసుపత్రుల కేంద్రంగా మార్పు
- కిడ్నీ ఆపరేషన్‌కు రూ.60 లక్షలు వసూళ్లు
మదనపల్లె(అమరావతి): మదనపల్లె(Madanapalle)లో జరిగిన కిడ్నీ ఆపరేషన్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. కిడ్నీ డోనర్ నుంచి రిసీవర్ వరకూ కొందరు దళారులు ముఠాగా ఏర్పడి దందా సాగిస్తున్నారు. డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్, సిబ్బంది ద్వారా కొన్ని ఆసుపత్రులు, మరికొందరు వైద్యులు సంయుక్తంగా ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలా పాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇలా మదనపల్లె నుంచి బెంగళూరుకు కిడ్నీలను తరలించి అక్కడి ఆసుపత్రులలో రోగులకు అమరుస్తున్నారు. ఇందుకు మదనపల్లెలో తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ.

విశాఖపట్నంకు చెందిన ఎస్.యమున(29)ని, గాజువాక ఏరియాకు చెందిన పద్మ, సత్యలు కిడ్నీ విక్రయానికి డబ్బులు ఎరగా చూపారు. ఇందులో భాగంగా మదనపల్లె, కదిరి ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాల్లో పనిచేస్తున్న బాలరంగడు, మెహరాజ్‌లను ఆశ్రయించి యమునను మదనపల్లెకు తీసుకొచ్చారు. అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆంజనేయులు నిర్వహిస్తున్న గ్లోబల్ ప్రైవేటు ఆసు ప్రతిలో చేర్పించారు. ఇక్కడ డాక్టర్ ఆంజనేయులు కుమారుడు డాక్టర్ అవినాష్ ఆర్థోపెడిక్, కోడలు శాశ్వతి కంటివైద్య నిపుణురాలుగా పనిచేస్తున్నారు.

అలాగే కోడలు శాశ్వతి, స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం ఇన్‌చార్జిగా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇదే విభాగాల్లో పనిచేస్తున్న టెక్నీషియన్ల ద్వారా కిడ్నీ డోనర్స్‌ను తీసుకొచ్చి ఆపరేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం బెంగళూరులోని స్పెషలిస్టులను రప్పించి కిడ్నీ మార్పిడి, రవాణా వ్యవహారం నడుపుతున్నారు. ఇక్కడ జరిగింది కూడా ఇదే. వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన మధ్యవర్తులు, యమునాను తీసుకొచ్చి కిడ్నీని తొలగించారు. అలాగే బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ ఆసుత్రులు..కిడ్నీ రిసీవర్స్‌తో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పనికానిస్తున్నారు. అయితే డోనర్ యమున మృతితో ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది.
డోనర్ మృతితో వెలుగులోకి..
- డయాలసిస్ కేంద్రం తనిఖీ
- కిడ్నీ రాకెట్.. గ్లోబల్ ఆసుపత్రి సీజ్
- నిద్రమత్తులో వైద్యశాఖ అధికారులు
- రెండూ తీసేశారా ? బాధితుల అనుమానం
మదనపల్లె: మదనపల్లెలో కిడ్నీ ఆపరేషన్, ఆపై డోనార్ యమున మృతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మదనపల్లె పేరు మరోసారి మార్మోగింది. గ్లోబల్ ఆసుపత్రిలో మంగళవారం నాటి సంఘటనతో ఉలిక్కపడ్డ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం స్థానిక జిల్లా ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రం, సంఘటన జరిగిన గ్లోబల్ ఆస్పత్రిని డీఎంఅండ్‌హెచ్‌ఓ దేవశిరోమణి, అడిషనల్ డీఎంఅండ్ హెచ్‌ఓ రమేష్‌బాబు తనిఖీ చేశారు. అందులోని రికార్డులను పరిశీలించారు.
ఇక్కడి నిందితునిగా ఉన్న టెక్నీషియన్ బాలరంగని వ్యవహారశైలిపై ఆరా తీశారు. ఈయన ఎన్నిరోజులుగా పనిచేస్తున్నాడు.. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు. వారంతా ఎక్కడెక్కడి వారు.. మొదట్లో వస్తున్న వారంతా ఇప్పుడూ కేంద్రానికి వస్తున్నారా? లేదా అనే కోణంలోనూ ఆరా తీసిన అధికారులు, అక్కడి రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్‌బీఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రికి చేరుకుని రికార్డులు, ఆపరేషన్ థియేటర్‌ను పరిశీలించారు. ఆసుపత్రి అనుమతికి సంబంధించిన రికార్డులు లేకపోవడంతో ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇది మొదటిసారేనా..?
మరోవైపు ఇక్కడి ఆసుపత్రిలో ఎన్ని రోజులుగా ఎన్ని ఆపరేషన్లు చేశారు? అందులోని పేషంట్లు, వారికి సంబంధించిన వివరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కిడ్నీ ఆపరేషన్‌కు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలోనూ డీఎంఅండ్ హెచ్‌వో, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వోలు ఆరా తీస్తు న్నట్లు చెబుతున్నారు. తాము ఆసుపత్రిని నిర్వహించ లేదని, కొందరు అద్దెకు అడిగితే ఆపరేషన్ థియేటర్ ఇచ్చామని, ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన అధికారు లకు డాక్టర్ ఆంజనేయులు కుమారుడు చెప్పినట్లు తెలిసింది.
అయితే, ఆయన తండ్రి కూడా ప్రభుత్వ ఉద్యోగి, అందులోనూ జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయకర్త హోదాలో ఉంటూ ఇలా జరగడం ఏంటని ప్రశ్నించినట్లు చెబుతున్నారు. మరో వైపు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్నింటికి అనుమతులు లేకపోగా, మరికొన్నింటికి ఉన్నా ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నా.. జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. సంఘటన జరిగాక, హడావిడి తనిఖీలు చేయడం, రికార్డులు ఎత్తుకెళ్లడం, ఆసుపత్రులను సీజ్ చేయడం మినహా.. సాధారణంగా ఆ పనులు చేయడం లేదు. ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన అధికారులే నిద్దరో తుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం మినహా అడ్డుకట్ట పడదనే వాదన విని పిస్తోంది.
డోనర్ మృతితో వెలుగులోకి..
విశాఖపట్నంకు చెందిన కిడ్నీ డోనార్ యమున మృతితో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఎవరిదారిన వారు వెళ్లిపోయేవారు. అయితే విధి రాతను ఎవరూ తప్పించుకోలేరన్న వాదన నిజమైం దని స్థానికులు నిట్టూరుస్తున్నారు. ఆపరేషన్ అనంతరం మృతిచెందడం, తర్వాత ఈ విషయాన్ని కుటుంబీకులకు సరైన పద్ధతిలో చెప్పడంలో మధ్య వర్తులు పద్మ, సత్యలు విఫలమైనట్లు చెబుతున్నారు. అలాగే మృత దేహాన్ని యమునతో కలిసి ఉంటున్న సూరిబాబుకు చూపించలేదని తెలిసింది. దీంతో మృతురాలికి రెండు కిడ్నీలూ తీసేశారేమోనన్న అనుమానం కలిగినట్లు తెలుస్తోంది. దీంతోనే వివాదం పెద్దదై, చివరకు పోలీసులు, కేసుల వరకూ వెళ్లినట్లు చర్చ నడుస్తోంది.
మొదట సూరిబాబును సర్దుబాటు చేసి తర్వాత మృతదేహాన్ని విశాఖ తరలించి ఉంటే అక్కడ అంతా సవ్యంగా జరిగేదేమోనని భావిస్తున్నారు. యమున కిడ్నీని గోవాకు చెందిన ధీరజ్‌నాయక్‌కు అమర్చడానికి ఒప్పందం కుదుర్చుకోగా, ఇందులో బెంగళూరుకు చెందిన స్పెషలిస్టు ఆపరేషన్ చేసినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఒకే బ్లాడ్ గ్రూపు గల వ్యక్తికి సంబంధించిన కిడ్నీనే కావాల్సి వుంటుంది. అది కూడా చట్టపరంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం, లేదా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ప్రాధాన్యత క్రమంలో కావాల్సిన శరీర అవయవాలను సమకూర్చే అవకాశం ఉంది. అది కూడా బతికున్న వారివి కాకుండా, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుకు దగ్గరలో ఉంటూ, అది కూడా బాధితులే స్వచ్ఛందంగా ఇచ్చే వాటిని స్వీకరించాల్సి వుంటుంది.
స్పెషలిస్టును పిలిపించినా..
డోనర్ నుంచి కిడ్నీని తొలగించి రిసీవర్స్‌కు అమర్చడం చాలా కష్టంతో కూడిన పనిగా చెబుతున్నారు. అయితే అందుకు ఆపరేషన్ థియేటర్, సంబంధించిన పరికరాలన్నీ ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి. వాటితో పాటు అనుభవజ్ఞుడైన స్పెషలిస్టు కూడా ఉండాలి. కానీ మదనపల్లెలో గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ మినహా ఆ స్థాయిలో పరికరాలు, సౌకర్యాలు లేవని చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీని ఆయా ఇన్‌జక్షన్లతో భద్రపరిచి తరలించే ప్రత్యేక పరికరం కూడా ఉండాలని చెబుతున్నారు. మరోవైపు ఇందుకోసం యూరాలజీ లేదా నెప్రాలజీ వైద్యుడు అనస్థీషియాతో పాటు రిసీవర్‌కు అమర్చే స్పెషలిస్టు ఉండాలి.
అయితే మదనపల్లెలో మూడునాలుగు ఆసుపత్రులలో తప్పా, ఆపరేషన్ థియేటర్ లేవని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే, డాక్టర్ ఆంజనేయులు అనస్థీయా స్పెషలిస్టు, కోడలు శాశ్వతి కూడా డయాలసిస్ కేంద్రం ఇన్‌చార్జి కావడంతో కిడ్నీ మార్పిడికి అవకాశం ఏర్పడినట్లు చెబుతున్నారు. ఇక్కడ కిడ్నీని ఆపరేషన్‌తో తొలగించే అవకాశమే ఉందని, అందుకే బెంగళూరు నుంచి రప్పించిన స్పెషలిస్టుతో తీసేసి, ఆయన పర్యవేక్షణలో బెంగళూరు లేదా ఇతర ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే డోనర్‌గా ఉన్న యమున కిడ్నీని గోవాకు చెందిన రిసీవర్ ధీరజ్‌సింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
ఈ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో మధ్యవర్తులు డోనర్స్‌ను తీసుకొచ్చే బెంగళూరు, హైదరాబాద్, తదితర ప్రాంతాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించి అక్కడ అందుబాటులో ఉన్న రిసీవర్స్‌కు అమరుస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం రూ.60 లక్షలకు పైగా ఖర్చు అవుతుండగా, డోనర్, మధ్యవర్తులకు రూ.10లక్షలు నుంచి రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అయితే మదనపల్లె కేంద్రంగా ఇప్పటి వరకూ ఇలా కిడ్నీ రాకెట్ వ్యాపారం జరగలేదని, గ్లోబల్ ఆసుపత్రిలో ఎన్ని రోజులుగా జరుగుతోందోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రుల నిర్వహణకు రూ.కోట్లు ఖర్చు చేస్తూ, ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో కొందరు ఇలాంటి ప్రత్యేకమైన, చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా కిడ్నీ రిసీవర్స్ అంతా డయాలసిస్ రోగులే. అలాంటి వారు చాలా మందే ఉన్నా.. దాన్ని అమర్చుకోవడం సాధారణ, మధ్య తరగతి వర్గాలు ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు చేసే అవకాశం లేదు. ప్రస్తుతం ఇలాంటి వారంతా పెద్దపెద్ద వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఆర్థిక స్థోమత ఉన్నవారే. వారంతా కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ, కిడ్నీలు అమర్చుకుంటుండగా, వీటిని పేద, ఆర్థిక ఇబ్బందులోని బాధితులను ఆశ్రయిస్తున్నారు. ఇందులో రిసీవర్స్ తరపున వైద్యులు, డోనర్స్ తరపున ఏజెంట్లు, మధ్యవర్తులుగా డయాలసిస్ కేంద్రాల్లోని టెక్నీషియన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం సమాజం సరోగసి తరహాలోనే కిడ్నీ వ్యాపారం విస్తరించి ముఠాగా మారినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News