Share News

Macherla Court : తురకా కిశోర్‌కు రిమాండ్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:01 AM

మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల అండతో అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ తుర కా కిశోర్‌కు మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Macherla Court : తురకా కిశోర్‌కు రిమాండ్‌

  • అతడి సోదరుడు శ్రీకాంత్‌కు కూడా

  • మాచర్లలో 2022లో టీడీపీ కార్యాలయం, నేతల ఇళ్లు, వాహనాల ధ్వంసం

  • 14 రోజుల రిమాండ్‌ విధించిన న్యాయాధికారి

  • గుంటూరు జిల్లా జైలుకు తరలింపు

మాచర్ల టౌన్‌, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మాచర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిల అండతో అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన మాచర్ల మున్సిపాలిటీ మాజీ చైర్మన్‌ తుర కా కిశోర్‌కు మాచర్ల కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. అతడి తమ్ముడు శ్రీకాంత్‌ను కూడా రిమాండ్‌కు పంపింది. వైసీపీ సర్కారు హయాంలో రెచ్చిపోయిన కిశోర్‌.. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే తన తమ్ముడితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఏడు నెల ల తర్వాత వారిద్దరినీ మాచర్ల పోలీసులు చాకచక్యంగా హైదరాబాద్‌లోని టీఎన్జీవో కాలనీలో ఆదివారం అదుపులో కి తీసుకున్నారు. అదేరోజు రాత్రి పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలించారు. సోమవారం మాచర్ల కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తూ మార్గమధ్యంలోని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఇద్దరినీ మాచర్ల పట్టణ సీఐ ప్రభాకరరావు, ఎస్‌ఐలు మహ్మద్‌ షఫీ, వలీ ఆధ్వర్యంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు. కిశోర్‌, శ్రీకాంత్‌ తరఫున న్యాయవాది బారెడ్డి నాగిరెడ్డి, పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీంద్రకుమార్‌ వాదనలు వినిపించారు.


అనంతరం కిశోర్‌, శ్రీకాంత్‌లకు న్యాయాధికారి శ్రీనివాస కల్యాణ్‌ 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. తర్వాత వారిని పటిష్ఠ బందోబస్తు నడుమ పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. 2022 డిసెంబరు 16వ తేదీన మాచర్లలో టీడీపీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పురపాలక సంఘ కార్యాలయం సమీపంలో కిశోర్‌ తన రౌడీమూకలతో దాడికి పాల్పడ్డాడు. అనంతరం కిశోర్‌ తన రౌడీ గ్యాంగ్‌తో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ సానుభూతిపరుల గృహాలు, వాహనాలపైనా దాడులు చేసి తగులబెట్టారు. అయితే అప్పట్లో పోలీసులు కిశోర్‌పై ఐపీసీ 143, 147, 448, 427, 435, 436, 323 సెక్షన్లతో మాత్రమే కేసు(క్రైం నం.199) పెట్టారు. ఇప్పుడు పోలీసులు కొన్ని సెక్షన్లను మార్చి.. 143, 147, 148, 448, 427, 435, 436, 303, 120బీ, 109, 307, రెడ్‌ విత్‌ 34, 149 సెక్షన్లను పేర్కొన్నారు.

Updated Date - Jan 07 , 2025 | 04:01 AM