Tomato Prices Decrease: దారుణంగా పడిపోయిన టమోటా ధరలు.. ఇక రోడ్డుపై పారపోయాల్సిందేనా..
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:04 PM
కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గతేడాది కూరగాయల ధరలు చుక్కలు చూపించాయి. మార్కెట్‌కు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి తెచ్చాయి. ధరలు అమాంతం పెరిగి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచాయి. ముఖ్యంగా టమోటా ధర ఆకాశాన్ని అంటింది. చికెన్‌తో పోటీ పడుతుందా? అన్నట్లు కిలో టమోటా ధర రూ.100కు పైగా పలికింది. మరోవైపు ఉల్లిపాయ రేట్లు సైతం అమాంతం పెరిగిపోయాయి. టమోటా, ఉల్లి.. నువ్వా, నేనా? అన్నట్లు పోటీ పడుతూ ధరలు కొండెక్కాయి.
అయితే తాజాగా టమోటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈసారి టమోటా రైతులు అధికంగా పంటలు పడించడం, దిగుబడీ పెరగడంతో టామోటాలు మార్కెట్లకు పోటెత్తాయి. డిమాండ్, సప్లై సూత్రం ప్రకారం.. సప్లై అధికంగా ఉండడంతో డిమాండ్ తగ్గిపోయింది. దీంతో రేట్లు తగ్గుముఖం పట్టాయి. రెండు వారాల క్రితం కిలో టమోటా రూ.20 పలకగా.. పోయిన వారం అది రూ.10కి చేరింది. అయితే తాజాగా కిలో ధర రూ.4కు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంట రేటు మరీ ఇంత దారుణంగా పడిపోవడం చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆస్పరి, పత్తికొండ మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.4కు చేరింది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. దీంతో పత్తికొండ మార్కెట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. కాగా, ధరలు పడిపోయి పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో ఇక వాటిని పారపోయడం తప్ప చేసేదేమీ లేదని టమోటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్, కోడిగుడ్ల రేట్లు సైతం భారీగా పడిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోళ్ల మృతిచెందుతుండడంతో చికెన్, కోడిగుడ్లు కొనేందుకు వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొండెక్కిన రేట్లు దిగివస్తున్నాయి. అయితే నష్టపోతున్నామంటూ వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rekha Gupta Oath Ceremony: ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం..
Delhi: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కేంద్ర మంత్రులతో వరస భేటీలు..