YSRCP leaders Meets EC: బ్యాలెట్ విధానంలో ఎన్నికలు.. వైవీ సుబ్బారెడ్డి డిమాండ్
ABN , Publish Date - Jul 03 , 2025 | 01:27 PM
YSRCP leaders Meets EC: ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ, జులై 3: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను (Election Commission) వైసీపీ నేతల బృందం (YSRCP Leaders) ఈరోజు (గురువారం) కలిసింది. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి (YSRCP Leader YV Subbareddy) మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆహ్వానించినట్లు తెలిపారు. ఓటర్ లిస్టు , పోలింగ్ సరళి తదితర అంశాలపై చర్చలు జరిగాయన్నారు. 2024 జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లకు , వివి ప్యాట్‌లు పోల్చి చూడాలని చెప్పామని ఆయన తెలిపారు. ఈవీఎంలలో బ్యాటరీల పైన కూడా సందేహాలు ఉన్నాయన్నారు.
ఏపీలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువ నియోజకవర్గాలలో పోలింగ్ శాతం పెరిగిందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌లో దాదాపు 50 లక్షలు ఓట్లు పోలయ్యాయని.. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం పార్లమెంట్ ఎన్నికలలో ఈవీఎం ఓట్లు, వివి ప్లాట్లు కంపారిజన్ చేయమని కోరినట్లు తెలిపారు. కానీ వివి ప్యాట్‌ల కంపారిజన్ చేయమని ఈసీ తెగేసి చెప్పిందన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయాలని అడిగితే నిరాకరించారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని... అందుకే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు.
రాయచోటిలో ఓటర్ల సంఖ్య చాలా పెరిగిందని తెలిపారు. బీహార్ తరహాలో ఏపీలో కూడా స్పెషల్ ఇంటెన్సిఫై రివిజన్ చేయాలని కోరామని.. దానికి ఈసీ ఒప్పుకుందన్నారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 38వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు బిన్నమైన పోలింగ్ నమోదు అయ్యిందన్నారు. వచ్చే ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉందని చెప్పుకొచ్చారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే , బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగాలని స్పష్టం చేశారు. తాము ఎన్డీఏలో లేమని.. ఇండియా కూటమిలో కూడా లేమని తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (YSRCP Chief YS Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ముందు తమ అనుమానాలను వివరించామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్కే బీచ్‌కు బ్లూ ఫ్లాగ్.. మంత్రి దుర్గేష్ ఏమన్నారంటే
జైలు ప్రాంగణంలో చెవిరెడ్డి అరుపులు.. తప్పుడు కేసులంటూ హడావుడి
Read latest AP News And Telugu News