Share News

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల

ABN , Publish Date - Oct 30 , 2025 | 04:05 PM

మొంథా తుఫాన్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్పందించారు. మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు..

YS Sharmila On Cyclone : ఇది మహా విపత్తు కాబట్టి.. ఇలా చేయండి: షర్మిల
YS Sharmila On Cyclone

విజయవాడ: రాష్ట్రంపై ప్రధాని మోదీ సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరాదిన ప్రకృతి విలయాలకు వెంటనే జాతీయ విపత్తులుగా ప్రకటించుకునే ప్రధాని, మొంథా తుఫాన్ ధాటికి జనజీవనం అల్లకల్లోలం అయితే తమకేం పట్టనట్లు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ, ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నారు.


జాతీయ విపత్తుగా ప్రకటించాలి

మొంథా తుఫాన్ రైతన్నకు అపార నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చిందని, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా నీట మునిగాయని, ఖరీఫ్ సీజన్‌లో సాగైన పంటల్లో 30 శాతం పనికి రాకుండా పోయాయని, 10 లక్షల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ఇది రాష్ట్ర రైతాంగానికి సంభవించిన మహా విపత్తు అని, రూ. 20వేల కోట్లకు పైగానే రైతులకు అపార నష్టం జరిగిందని వివరించారు. మొంథా తుఫాన్‌ను జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రళయం మిగిల్చిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు మోదీ ప్రకటించాలన్నారు.


భావ్యం కాదు

రాష్ట్రానికి ఇది ఆపద కాలమని.. 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేయడం భావ్యం కాదన్నారు. ఇది రైతులను మోసం చేయడమేనని అన్నారు. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే ఉందని, NDA ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు .. మోదీ మోసాలపై ఇప్పుడైనా నోరు విప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. మొంథా తుఫాన్‌ను జాతీయ విపత్తుగా గుర్తించాలని, జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

సమిష్టి కృషితో ఒడ్డుకు చేరిన భారీ బోటు.. యంత్రాంగానికి అభినందన వెల్లువ

వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

Read Latest AP News

Updated Date - Oct 30 , 2025 | 04:34 PM