Share News

Tiruvuru MLA: పెద్దిరెడ్డితో భేటీపై కొలికపూడి క్లారిటీ

ABN , Publish Date - Jul 23 , 2025 | 09:58 PM

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇలా తనపై ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు.

Tiruvuru MLA: పెద్దిరెడ్డితో భేటీపై కొలికపూడి క్లారిటీ
Tiruvuru MLA Kolikapudi Srinivasa Rao

విజయవాడ, జులై 23: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తాను భేటీ కావడంపై జరుగుతున్న దుష్ప్రచారంపై తిరువురు ఎమ్మెల్యే, టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. బుధవారం తిరువూరులోని తన నివాసంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడుతూ.. జులై 19వ తేదీన తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లానన్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో విమానంలో తాము వెళ్తున్నామని.. ఆ క్రమంలో అదే విమానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నారని చెప్పారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత బాగున్నారా సార్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడిగానని.. ఆయన బాగున్నానంటూ సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇదంతా జస్ట్ 8 సెకన్లలో జరిగిపోయిందన్నారు.


అయితే తాను తిరుపతి పర్యటనలో ఉండగానే.. సీఎం కార్యాలయం నుంచి అమరావతి రావాలంటూ తనకు కబురు అందిందని పేర్కొన్నారు. అనంతరం సీఎం కార్యాలయానికి తాను వెళ్లానని.. మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10.40 వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తాను సమావేశమయ్యానన్నారు. అదే రోజు రాత్రి అమరావతి నుండి తిరిగి తిరువూరుకు రావడం జరిగిందని వివరించారు. ఇక మంగళవారం, ఈ రోజు అంటే.. బుధవారం తిరువూరులో తాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని చెప్పారు.


అయితే వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తాను రాజమండ్రిలో కలిసినట్లుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా తప్పుడు ప్రచారం చేసే వారికి ఒక రోజు బియ్యం వస్తాయేమో కానీ దాని గురించి ఏమీ ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఏడాది కాలంగా తనపై దుష్ప్రచారాలు చేసిన వారికి వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసునన్నారు. కేవలం ఈ వీడియో ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తే.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేందుకే తాను ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


కానీ దుర్మార్గం ఏమిటంటే.. మొన్న ఒక కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు వాటేసుకుని నవ్వుతూ మాట్లాడిన వీడియోలు బయటకు వచ్చాయని గుర్తు చేశారు. కానీ వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆవేశంగా అన్నారు. వాస్తవాలను వక్రీకరించే వారికి తాను చెప్పేది ఒకటేనన్నారు. మీరు ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు అసలు వాస్తవాలు ఏమిటన్నది తెలుసునని పేర్కొన్నారు.


సీఎం చంద్రబాబు నాయుడు.. మూడు రోజుల క్రితం తనను పిలిచి ఏడాది కాలంలో ఎమ్మెల్యేగా తన పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారన్నారు. తన పని తీరుకు సీఎం చంద్రబాబు 66.4% మార్కులు ఇవ్వడం జరిగిందని వివరించారు. తిరువూరు నియోజక వర్గంలో అవినీతికి సంబంధించి 5.5% ఆరోపణలు ఉన్నట్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా తెలిందన్నారు. తాను ఏం చేస్తున్నాను.. ఎలా పని చేస్తున్నానన్నది తనకు, తన తిరువూరు ప్రజలకే కాకుండా.. సీఎం చంద్రబాబుకు సైతం తెలుసునని చెప్పారు. ఇలాంటి గాలి వార్తలను ఎవరు పట్టించుకో వద్దని ఈ సందర్భంగా ప్రజలకు తెలియ జేస్తున్నానన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తండ్రీకొడుకులు దారుణ హత్య.. పోలీసుల అదుపులో నిందితుడు

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 23 , 2025 | 10:14 PM