Share News

Palla Srinivas Rao: స్టీల్ ప్లాంట్‌పై అపోహలు సృష్టించే యత్నం.. వైసీపీపై పల్లా సీరియస్

ABN , Publish Date - Nov 17 , 2025 | 10:06 AM

స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వల్లనే అని పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదని మండిపడ్డారు.

Palla Srinivas Rao: స్టీల్ ప్లాంట్‌పై అపోహలు సృష్టించే యత్నం.. వైసీపీపై పల్లా సీరియస్
Palla Srinivas Rao

అమరావతి, నవంబర్ 17: సీఎం చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు మాట్లాడటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivas Rao) మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నదాన్ని కేంద్రం నుంచి రాష్ట్రం సుమారు రూ. 14 వేల కోట్లు తీసుకొచ్చిందన్నారు. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుందన్నారు. దాని పట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులు ప్లాంట్‌ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదన్నారు.


కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి రూ.14 వేల కోట్లల్లో రూ.11 వేల కోట్లు తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం నుంచి కూడా సుమారు రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. 30 శాతం పనులు జరుగుతున్న ప్లాంట్‌ను 80 శాతం పనులు జరిగేలా చేశామని చెప్పుకొచ్చారు. పబ్లిక్ సెక్టార్‌లో ఉన్న ఏ ప్లాంట్ అయినా లాభాల్లో నడవాలంటే మేనేజ్‌మెంట్, కార్మికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ నాయకులతో కలిసి కొందరు వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడారని మండిపడ్డారు. లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు కృషితోనే ఈ ప్లాంట్ లాభాలబాటలో నడుస్తోందన్నారు. కార్మికులు, ప్రజానీకం, స్టీల్ ప్లాంట్‌లోని వారందరూ గ్రహించాలని అన్నారు. 2000వ సంవత్సరంలో కూడా వాజ్‌పేయి రూ. 1350 కోట్లు తీసుకొచ్చి ప్లాంట్‌ను నిలబెట్టారని గుర్తుచేశారు. రెండోసారి రూ. 1440 కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్‌ను నడపడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు గురించి చెడుగా మాట్లాడడం మంచిదికాదని అన్నారు. నేడు స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వలననే అన్న విషయం అందరూ గమనించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు.


అధికారులపై బురద జల్లడం మంచిపద్దతి కాదన్నారు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందో ప్రతిపక్షానికి కూడా ఆ బాధ్యత ఉండాలని హితవుపలికారు. లేనిపోని అపోహలు సృష్టించడం మంచిదికాదన్నారు. స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉందని.. అందులో భాగంగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 11,400 కోట్లు తీసుకుచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టే ప్రభుత్వం నుంచి నీరు, విద్యుత్, పన్నులు ఇతరత్రా రూపంలో సుమారు రూ.2,600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్‌కు కూడా రాష్ట్రం పెట్టిన దాఖలాలు లేవని అన్నారు.


ఏపీలో కార్మికులను, నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేడు ఆ ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి నిధులు తేవడం జరిగిందని తెలిపారు. కార్మికులను భయాందోళనకు గురిచేయొద్దని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని.. ఈ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. ఎంత వక్రీకరించి మాట్లాడినా ప్రజలు విజ్ఞులు కావున అర్థం చేసుకోగలరన్నారు. ఎన్డీయే కూటమిపై ప్రజలకు అపార నమ్మకం ఉందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులే కాకుండా ప్రతిపక్షం కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

సాక్ష్యాలను తారుమారు చేసేందుకే సతీశ్‌ హత్య

కన్నబిడ్డపైనే కామాంధుడి కన్ను

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 17 , 2025 | 10:19 AM