Share News

Devotee Nuti Pooja: గోవింద నామాలతో ఒత్తిడి చిత్తు!

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:56 AM

పది లక్షల సార్లు గోవింద నామాలు రాసిన మహిళకు తొలి గడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించింది.

Devotee Nuti Pooja: గోవింద నామాలతో ఒత్తిడి చిత్తు!

  • 10 లక్షల సార్లు రాసిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

  • తొలిగడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనం

తిరుమల, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): పది లక్షల సార్లు గోవింద నామాలు రాసిన మహిళకు తొలి గడప నుంచి తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం లభించింది. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన నూతి పూజ(24) హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగిని. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం విధానంలో ఆమె ఇంటినుంచే పనిచేస్తున్నారు. అమెరికా ప్రాజెక్టు కావడంతో అర్ధరాత్రి వరకూ కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయాల్సి వచ్చేది. ఓవైపు కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ ఒత్తిళ్లతో ఆమె మానసికంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో టీటీడీ ప్రకటించిన ‘గోవింద కోటి’ కార్యక్రమం గురించి తెలియడంతో శ్రీవారి భక్తురాలైన పూజ తాను కూడా స్వామివారి నామాలు రాయాలని భావించారు. తొలుత లక్ష నామాలు రాయాలనుకున్నా అందులో లభిస్తున్న ఆనందంతో దాన్ని కొనసాగించి ఇటీవల పది లక్షల నామాలు పూర్తి చేశారు. మొత్తం 10,01,116 సార్ల్లు గోవింద నామాలు రాసిన ఆమెకు టీటీడీ ఈ నెల 14న ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించింది. భర్త అభిషేక్‌తో పాటు తిరుమల వచ్చిన పూజ తొలి గడప నుంచి శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు ఆఫ్‌లైన్‌ ద్వారా లక్కీడి్‌పలోనూ కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ, గోవింద నామాలు రాయడం మొదలుపెట్టిన తర్వాత పని ఒత్తిడిని అధిగమించగలిగానని, తనలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు చాలా ప్రశాంతత లభించిందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో తొలి గడప నుంచే ఆయన్ను దర్శించుకొనే అదృష్టం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 17 , 2025 | 04:58 AM