TDP MPs: విమాన సర్వీసులపై కేంద్ర మంత్రితో టీడీపీ ఎంపీల చర్చలు
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:56 PM
విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ ఎంపీలు కోరారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసులపై కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కలిశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో (Union Minister Rammohan Naidu) టీడీపీ ఎంపీలు ఈరోజు (సోమవారం) భేటీ అయ్యారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసులు, ప్రయాణీకుల అవస్థలపై కేంద్రమంత్రిని తెలుగుదేశం ఎంపీలు కలిశారు. విజయవాడ - హైదరాబాద్ విమాన సర్వీసుల ధరలు రూ. 18 వేలపైనే ఉంటున్నాయని… అయినా సీట్లు దొరకడం కష్టమవుతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏటీఆర్ చిన్న విమానాల వల్లే ఈ సమస్య ఏర్పడుతోందన్నారు. అమరావతికి వచ్చే పెట్టుబడిదారులు కూడా ఏటీఆర్‌లను చూసి ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు.
విదేశీ ప్రయాణీకుల లగేజ్ కూడా వారితో రావడం లేదని, రెండు మూడు రోజుల తర్వాత చేరుతుందన్న ఫిర్యాదులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయని ఎంపీలు తెలిపారు. అవకాశం ఉన్నంతలో త్వరగా ఏటీఆర్‌ల స్థానంలో పెద్ద విమానాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని రామ్మోహన్ నాయుడిని కోరారు. ఈ విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని ఎంపీలకు కేంద్రమంత్రి తెలిపారు. అదే విధంగా విజయవాడ నుంచి అహ్మదాబాద్, వారణాసి, పూణే, కొచ్చి, గోవాలకు కూడా కనెక్టివిటీ ఇవ్వాలని ఎంపీలు కోరారు.
ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబైకి నడుస్తున్న సర్వీసులను అంతర్జాతీయ విమానాల కనెక్టివిటీకి అనుసంధానం చేయాలన్నారు. వచ్చే వారం రోజుల్లో ఈ విషయాలపై సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీలకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అయ్యప్ప భక్తులు విమానంలో ఇరుముడులు తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేసినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడికి టీడీపీ ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
పరకామణి కేసు.. విచారణ పూర్తి.. రేపు హైకోర్టుకు నివేదిక
Read Latest AP News And Telugu News