NTR Bharosa Pensions: ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:12 AM
ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే 62.40 శాతం మంది లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు.
అమరావతి, డిసెంబర్ 1: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల (NTR Bharosa Pensions) పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఉదయం (సోమవారం) నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9:00 గంటలకే 62.40 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ఇక ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గొల్లగూడెం, గోపీనాథపట్నం లబ్ధిదారులకు సీఎం పింఛన్లు ఇవ్వనున్నారు.
ఈనెల (డిసెంబర్) ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రూ.2,738 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల ఇచ్చే పింఛన్లతో కలిపి రూ.50,763 కోట్లు పేదల కోసం కూటమి సర్కార్ ఖర్చు చేసింది.
జోరు వానలోనూ...

నెల్లూరు జిల్లా 11వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో మంత్రి నారాయణ, నుడా చైర్మన్ కోటంరెడ్డి పర్యటించారు. జోరు వానలో ఇంటింటిటికీ వెళ్లి పెన్షన్లను అందజేశారు. వర్షంలో కూడా తమ ఇంటికి వచ్చి పెన్షన్ అందచేసిన నేతలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెల్లారి ఆరు గంటల నుంచే 68 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు. వర్షంలో కూడా పెన్షన్ పంపిణీకి వచ్చిన మీకే మా ఓటని సంతోషంగా చెప్పారని అన్నారు. తాము ఓటు కోసం రాలేదు ఇచ్చిన మాట కోసం వచ్చామని లబ్ధిదారులకు చెప్పినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఏలూరులో పెన్షన్ల పంపిణీ...
ఏలూరులో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఏలూరులో 2వ డివిజన్ పరిధిల రామానగర్‌లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎమ్మెల్యే పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బడేటి చంటి.. లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల డబ్బులు అందజేశారు. ఏలూరు నియోజకవర్గంలో కొత్తగా 32 మందికి నూతన పింఛన్లు మంజూరు చేశారు. 27 మంది వితంతువులకు, ఐదుగురు డయాలసిస్‌తో బాధపడుతున్న పేషెంట్లకు 10 వేల రూపాయలను అధికారులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రజల కోసమే కష్టపడుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే పాటు పడుతుందని ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
తుస్సుమన్న జగన్ ప్లాన్.. పీపీపీపై వైసీపీ నేతలు రివర్స్
Read Latest AP News And Telugu News