Share News

Government Orders: నెల్లూరు, ప్రకాశంకు రెడ్‌ అలెర్ట్‌..

ABN , Publish Date - Dec 01 , 2025 | 06:16 AM

దిత్వా తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముసురేసింది. ఆగాగి రోజంతా వర్షం కురుస్తూనే ఉంది.

Government Orders: నెల్లూరు, ప్రకాశంకు రెడ్‌ అలెర్ట్‌..

  • తుఫాన్‌ ముసురుతో వర్షం.. జనం అవస్థలు

  • నెల్లూరులో నేడు బడులకు సెలవు

  • విద్యుత్‌ ఉద్యోగులకు సెలవుల రద్దు

నెల్లూరు(హరనాథపురం), ఒంగోలు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ముసురేసింది. ఆగాగి రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. సాగరతీరం కల్లోలంగా మారింది. కావలి మండలం తుమ్మలపెంట, కొత్తసత్రం సముద్రతీరం 50 అడుగుల మేర ముందుకు రావటంతోపాటు 5 అడుగులమేర అలలు ఎగసి పడుతున్నా యి. దీంతో మెరైన్‌ పోలీసులు పర్యాటకులను సముద్ర స్నానాలకు రాకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలకు విద్యుత్‌ ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు సిబ్బందికి సెలవులు రద్దు చేశామని ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. అలాగే, జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో బాలాజీరావు, ఆర్‌ఐవో వరప్రసాద్‌రావు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో ఎగువ నుంచి ఏక్షణమైనా వరద వచ్చే సూచనలు ఉండడంతో సోమశిలలో ఉన్న నీటినిల్వను తగ్గించేలా చర్యలు తీసుకున్నారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రులు

తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, రోడ్లు, భవనాలశాఖ, విద్యుత్‌శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ, జిల్లాలో నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో మంత్రి నారాయణ కోరారు.


ప్రకాశం జిల్లాలో..

తుఫాన్‌ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదివారం ఉదయం నుంచి గాలుల తీవ్రత అధికమైంది. చిరు జల్లులు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తీర ప్రాంతాలతోపాటు సమీప 14 మండలాల్లోని 168 గ్రామాలపై తుఫాన్‌ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. కీలక శాఖలతోపాటు తీరప్రాంత అధికారులను కలెక్టర్‌ పి.రాజాబాబు అప్రమత్తం చేశారు.


అన్నదాతల్లో ఆందోళన

ఉమ్మడి గోదావరి జిల్లాలపై తుఫాను ప్రభావం

అమలాపురం, భీమవరం రూరల్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్‌ మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో తుఫాను ప్రభావంతో ఈదురుగాలులకుతోడు చిరుజల్లులు పడుతుండడంతో రైతులు వణికిపోతున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే కోతలు ప్రారంభం కావడంతో వరి పనలను ఒడ్డుకు చేర్చడం, ధాన్యపు రాశులను సంరక్షించుకునే పనిలో ఉండగా, ఇప్పుడు చిరుజల్లులు కంటిమీద కునుకు ఉండనివ్వడంలేదు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానూ ఎడతెరిపి లేకుండా చిన్నపాటి చినుకులు పడుతున్నాయి. రైతుల్లో కంగారు మొదలైంది. సార్వా పంట లక్షా 27వేల ఎకరాల్లో ఉంది. మాసూళ్లు అయిన 30 వేల టన్నుల ధాన్యం రహదారుల పక్కన పంటచేల దిబ్బలపై ఉండి పోయింది. అధిక వర్షాలు కురిస్తే కోత దశలోని చేలకు నష్టం. ధాన్యం రాశులే తడిసిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Pattali Makkal Katchi: ఏపీలో వన్నియకుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ వర్గాలకు 6శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Devji Family: దేవ్‌జీని కోర్టులో హాజరు పరచాలి

Updated Date - Dec 01 , 2025 | 09:14 AM