Purandeswari: 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేలా మోదీ లక్ష్యం..
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:10 PM
BJP: ప్రధాని మోదీ యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని.. రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.

Vijayawada: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) 2047 నాటికి వికసిత్ భారత్ (Developed India 2047) సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు (AP BJP Chief), ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (MP Daggubati Purandeswari) అన్నారు. ఆదివారం విజయవాడలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం (BJP SC Morcha Meeting) జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి పురందేశ్వరి, పాతూరి నాగభూషణం, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందు ఉండాలని, వాటి ద్వారా వచ్చే ఫలితాలను సమాజంలో అన్ని వర్గాల వారికి అందించడమే ప్రధాన ఉద్దేశమని, అందరికీ సంక్షేమం, దేశం అభివృద్ధి సాధించడమే వికసిత్ భారత్ లక్ష్యమని ఆమె అన్నారు.
డ్రోన్‌ల కొనుగోలుకు పది లక్షలు ఉంటే..
రైతులు, యువత, మహిళలను అభివృద్ధి పథంలో నడపాలని, యువతకు వివిధ రూపాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయూతను ఇస్తున్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపారాలు పెట్టుకునే అవకాశం కల్పించారని, డ్రోన్‌ల కొనుగోలుకు పది లక్షలు ఉంటే.. అందులో ఎనిమిది లక్షలు ప్రభుత్వం ఇస్తుందని, రెండు లక్షలతో వ్యవసాయానికి ఈ డ్రోన్‌లు వాడుకోవచ్చునని ఆమె అన్నారు.
రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు..
రైతుల కోసం ప్రతియేడాది రూ. 6 వేలు కేంద్రం ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం వారికి అదనంగా డబ్బులు ఇస్తోందని పురందేశ్వరి అన్నారు. ఫసల్ భీమా యోజన ద్వారా రైతులకు సహకారం అందిస్తోందని, రైతు సుభిక్షంగా ఉంటే.. దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. బీసీ కమిషన్‌కు చట్ట బద్దత ఇచ్చి, బిసీ కులాలకు అండగా నిలిచారన్నారు. ఎస్సీ కులాల వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తోందని, బీజేపీ అంటే ఎస్సీలకు వ్యతిరేకం అని విపక్షాలు ప్రచారం చేశాయని.. అయినా ప్రజలు మోదీ సమర్థవంతమైన పాలనను నమ్మారని అన్నారు. అంబేద్కర్‌ను గౌరవించిన ఏకైక పార్టీ, ఆయన ఆశయాలను అమలు చేసిన పార్టీ బీజేపీ మాత్రమేనని పురందేశ్వరి పేర్కొన్నారు.
అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ రాజకీయం..
వాజ్‌పేయి హయాంలో అంబేద్కర్‌కు భారతరత్న ఇచ్చారని, ఆయన నడయాడిన నేల, నివాసం ఉన్న ప్రదేశాలను బీజేపీ ప్రభుత్వం పంచ తీర్థాలుగా అభివృద్ధి చేసిందని పురందేశ్వరి అన్నారు. కాంగ్రెస్ అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయం చేసిందని.. అంబేద్కర్ కోసం అసలు కాంగ్రెస్ నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ జమానా నుంచి కాంగ్రెస్ వాళ్లు అంబేద్కర్‌ను అవమానిస్తూనే వచ్చారని.. ‘అంబేద్కర్ రాజ్యాంగం వల్లే నేను ప్రధాని అయ్యానని’ మోదీ గర్వంగా చెప్పుకున్నారని అన్నారు. భారత రాజ్యాంగాన్ని 22 సార్లు సవరించినా.. అది ప్రజల కోసమేనని చెప్పారు. ప్రభుత్వాలను కూలదోయడానికి, వాక్ స్వాతంత్య్రం హరించడానికి రాజ్యాంగాన్ని మార్చలేదని, ఎస్సీ మోర్చా సమావేశం ద్వారా ఈ పరిణామాలను తాము ప్రజల్లోకి తీసుకెళుతున్నామన్నారు. యోగా డే సందర్భంగా రెండు గిన్నిస్ రికార్డులు ఏపీకి దక్కడం ఆనందంగా ఉందన్నారు. 23వ తేదీన శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ సందర్భంగా నివాళులు అర్పిస్తామన్నారు. ఎమర్జెన్సీ దివస్‌తో పాటు, తల్లి పేరుతో ఒక మొక్కను నాటే కార్యక్రమం చేపడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమ్మేళనాలు చేపట్టి ప్రజలకు అన్ని విషయాలు వివరిస్తామని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
గంజాయి తనిఖీలకు వెళ్లి.. కానిస్టేబుల్ మృతి
డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు..
విశాఖ యోగాకు గిన్నిస్ బుక్‌లో స్థానం
For More AP News and Telugu News