Ashok Babu: చరమాంక దశకు జగన్ రాజకీయ జీవితం.. అశోక్ బాబు సంచలన కామెంట్స్
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:40 PM
కోర్టుకు వెళ్లే సమయంలో అంత ఆర్భాటం అవసరమా అంటూ జగన్‌పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందన్నారు.
అమరావతి, నవంబర్ 21: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan) మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు (Former MLC Ashok Babu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. 11 సీబీఐ, 9 ఈడీ చార్జిషీట్లు ఉన్న జగన్.. కోర్టుకు హాజరైన తీరు 'చావుకి, పెళ్ళికి ఒకే భజంత్రి' అనే సామెతను గుర్తు చేసిందంటూ ఎద్దేవా చేశారు. గతంలో సీనియర్ నాయకులు లాలూ, పీవీ నరసింహారావు నిరాడంబరంగా కోర్టుకు హాజరయ్యారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పంథా మార్చారన్నారు. గతంలో ఖర్చుల పేరు చెప్పి వాయిదాలు అడిగిన జగన్.. ఇప్పుడు చార్టెడ్ ఫ్లైట్‌లో వచ్చి వేల మందితో హడావుడి చేసి కోర్టుకు హాజరవడం విచిత్రమన్నారు. కోర్టు హాజరులో ఇంత బల ప్రదర్శన చూస్తే అసెంబ్లీకి వెళ్తున్నారా, కోర్టుకు వెళ్తున్నారా అనే సందేహం కలిగించిందని మాజీ ఎమ్మెల్సీ అన్నారు.
అసెంబ్లీకి రాని వ్యక్తి కోర్టుకు వెళ్లేటప్పుడు ఇంత ఆర్భాటం అవసరమా అని సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారన్నారు. జగన్ ఒక రకమైన ఉన్మాదం, భయంతో ఉన్నారని.. అతని రాజకీయ జీవితం చరమాంక దశకు చేరుకుందంటూ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి 11 సీట్లు ఇచ్చి జగన్ స్థాయి ఏంటో చెప్పేశారన్నారు. ఏ కేసులో శిక్ష పడినా రాజకీయ భవిష్యత్తు ఖతం అవుతుందని.. 2029లో కడపలో కూడా గెలవలేరని పేర్కొన్నారు. ల్యాండ్, శాండ్, వైన్ కుంభకోణాలలో లక్షల కోట్లు అవినీతి చేశారని... అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని అన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదట చంద్రబాబు నాయుడుపై నింద వేశారని.. కానీ ఇప్పుడు సీబీఐ సాక్ష్యాలు.. జగన్, అతని భార్య వైపు చూపిస్తున్నాయని తెలిపారు. తల్లిని, చెల్లెలిని సరిగ్గా చూడని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం చూస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఈ బల ప్రదర్శనలకు భయపడదని.. దీని వల్ల నష్టపోయేది జగన్, అతని శ్రేణులు మాత్రమే అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటంపై దృష్టి సారించిందని తెలిపారు. వైసీపీ శ్రేణులు వాస్తవాలు గమనించి, జగన్‌తో ఉండాలా? వద్దా? అనేది ఆలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు హితవుపలికారు.
ఇవి కూడా చదవండి..
మీన రాసి.. ఉమ్మడి జిల్లాలో పెరిగిన మత్స్య సంపద
సోషల్ మీడియాలో రైతుల పోస్టులపై మంత్రి నారాయణ రియాక్షన్
Read Latest AP News And Telugu News