Ponnam Calls Driver Balaraju: మంత్రి పొన్నం ఫోన్.. డ్రైవర్ బాలరాజు భావోద్వేగం
ABN , Publish Date - Nov 21 , 2025 | 01:42 PM
ఆర్టీసీ బస్సు డ్రైవర్ బాలరాజుపై దాడి ఘటనకు సంబంధించి మంత్రి పొన్నం స్పందించారు. బాలరాజుతో ఫోన్లో మాట్లాడి అతడిని ఓదార్చారు. ఈ క్రమంలో మంత్రితో ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్ కంటతడి పెట్టుకున్నారు.
సిరిసిల్ల జిల్లా, నవంబర్ 21: జిల్లాలో కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్దాయనను కాలితో తన్నుతూ దాడి చేసిన కారు డ్రైవర్‌పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దాడిపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్పందించారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ బాలరాజుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలరాజు కంటతడి పెట్టుకున్నారు. మంత్రితో ఫోన్లో మాట్లాడుతూనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
నా తప్పు లేదు సార్..
‘ఇన్నేళ్లుగా ఎలాంటి రీమార్క్ లేకుండా పని చేశా. బెస్ట్ డ్రైవర్‌గా అవార్డు కూడా అందుకున్నా సార్. నా తప్పు లేకున్నా నన్ను కొట్టాడు. తాగి వచ్చి తలపై కొట్టాడు... కాళ్లతో తన్నాడు’ అంటూ బాలరాజు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆయనను ఫోన్లోనే ఓదార్చారు మంత్రి. ధైర్యంగా ఉండాలని.. దాడి చేసిన వ్యక్తిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డ్రైవర్‌కు మంత్రి పొన్నం భరోసా ఇచ్చారు.
ఇదీ జరిగింది...
మరోవైపు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం గంగాపూర్‌కు చెందిన శ్రీకాంత్ బుధవారం నాడు ఇల్లంతుకుంట మండలం వల్లంపట్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అతడి ముందు ఆర్టీసీ బస్సు వెళ్తోంది. అయితే తన కారుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో బస్సును చేజ్ చేసి ఆపి మరీ బస్సులోకి వచ్చి డ్రైవర్ బాలరాజుపై విరుచుకుపడ్డారు. డ్రైవర్‌పై ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పక్కనే ఉన్న ప్రయాణికులు కారు డ్రైవర్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ పట్టించుకోలేదు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడి దృశ్యాలను బస్సులోని కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనను మంత్రి పొన్నం తీవ్రంగా ఖండించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుతో చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడ్డ కార్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల సీఐ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News